తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఎండలకుతోడు వడగాలులు పెరుగుతున్నాయి. గత వారం ద్రోణి ప్రభావంతో కొంతమేర ఎండలు తగ్గినట్లు అనిపించినా, మరలా విరుచుకుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మంగళవారం 88 మండలాల్లో వడగాలులు వీచాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుమ్మికపల్లిలో 45.2, రావికమతంలో 45.1, మక్కువలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే నాలుగు రోజులు 46 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కడప జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసరం అయితే తప్ప ఉదయం పది నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిచింది. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా సాయంత్రానికి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.