రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కిందకు వస్తుందని, వారితో కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా, గుంపులుగా కానీ, వ్యక్తిగతంగా కాని డ్వాక్రా మహిళలను ఏలాంటి కార్యక్రమంలోనూ పాలుపంచుకునే ప్రయత్నాలు చేయవద్దని చెప్పారు. డ్వాక్రా మహిళలను పోగుచేయడం, వారితో అవగాహనా కార్యక్రమాలు, సర్వేలు చేయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలయ్యేలా చూడాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల ప్రక్రియకు అధికారులు సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి మంగళవారం ఎన్నికల ప్రధాన అధికారి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీ విజల్ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. ఎన్నికలు జరిగే రోజు, ముందు రోజు అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు చేయవద్దన్నారు.