అయోధ్య బాలరాముని ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం సూర్యతిలకం దర్శనం ఇవ్వనుంది. ఆలయంలోని మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పరికరాల ద్వారా గర్భగుడిలోని బాలరాముడికి ఇవాళ మధ్యాహ్నం సూర్యకాంతితో తిలకం దిద్దనున్నారు. ఈ తిలకం 58 మి.మీల పరిమాణంలో ఉంటుంది. రెండు నిమిషాలపాటు భక్తులను కనువిందు చేయనుంది.
జనవరి 22న ప్రధాని మోదీ అయోధ్య రామాలయానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తరవాత లక్షలాది భక్తులు దర్శనాలకు వచ్చి తరిస్తున్నారు. వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక పరికరాలతో బాలరాముడికి సూర్యతిలకం దిద్దనున్నారు. ఏటా శ్రీరామనవమి రోజు ఈ సూర్యతిలకం దిద్దుతారు. సూర్య తిలక్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కటకాల ద్వారా మధ్నాహ్నం బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసారం కానుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు వేచిచూస్తున్నారు.