Supreme Court asks about Udaipur tailor during plea over lynchings
జూన్ 2022లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్యాలాల్
అనే టైలర్‌ను అతని దుకాణంలోనే ఇద్దరు ముస్లింలు పట్టపగలే హత్య చేసిన సంగతి ఇవాళ
సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది.
మైనారిటీలపై హింస పెరిగిపోతోందని, గోసంరక్షకుల
పేరుతో మైనారిటీలను చంపేస్తున్నారనీ, అటువంటి బాధితుల కుటుంబాలకు తక్షణం ఆర్థిక
సహాయం అందజేయాలంటూ ఒక ప్రజాహితవ్యాజ్యం దాఖలైంది. ఇవాళ ఆ పిల్ విచారణకు వచ్చింది.
ఆ సందర్భంగా న్యాయమూర్తి కన్హయ్యాలాల్ కేసును ప్రస్తావించారు.
మైనారిటీలకు న్యాయం పేరుతో దాఖలైన పిల్ జస్టిస్
బిఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం
ముందు విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా కన్హయ్యాలాల్ హత్య కేసును ఉదాహరిస్తూ న్యాయమూర్తులు,
అటువంటి కేసుల విషయంలో ఎంపిక చేసుకుని వ్యవహరించవద్దని హితవు పలికారు.
‘‘రాజస్థాన్‌లో హత్య చేయబడిన టైలర్ కన్హయ్యాలాల్
సంగతేంటి’’ అని న్యాయస్థానం పిటిషనర్‌లను ప్రశ్నించింది. అయితే ఆ కేసును ఈ పిల్‌లో
ప్రస్తావించలేదని వారి న్యాయవాది నిజాం పాషా వెల్లడించారు. ‘‘అన్ని రాష్ట్రాల్లోనూ
అలాంటి కేసులు ఉన్నప్పుడు మీరు కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసుకుని అడగకూడదు’’ అని
కోర్టు స్పందించింది.
ఒక టీవీ చర్చాకార్యక్రమంలో ముస్లిం మతగురువులు
హిందువుల ఆరాధ్యదైవం శివుడిని అవమానిస్తే, దానికి ప్రతిగా బీజేపీ ప్రతినిధి నూపుర్
శర్మ, మహ్మద్ ప్రవక్త గురించి ఇస్లామిక్ మతగ్రంథాల్లో రాసిఉన్న విషయాన్ని
ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. ఆ సమయంలో నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్
మీడియాలో కొన్ని పోస్ట్‌లు సర్క్యులేట్ అయ్యాయి. వాటిలో ఒకదాన్ని రాజస్థాన్‌లోని
ఉదయ్‌పూర్‌కు చెందిన కన్హయ్యాలాల్ అనే దర్జీ షేర్ చేసాడు. దాంతో అతన్ని ముస్లిములు
అతని దుకాణంలోకి చొరబడి చంపేసారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు గుజరాత్ రాష్ట్ర న్యాయవాది
అర్చనా పాఠక్ దవే స్పందిస్తూ, ఆ ప్రజాహితవ్యాజ్యం నిర్దిష్టంగా ముస్లిముల హత్యల
గురించి మాత్రమే ప్రస్తావిస్తోందని ఎత్తిచూపారు. ‘‘అలా ఎంపిక చేసి ఎలా చూపుతారు?
ప్రభుత్వం అన్ని మతాల ప్రజలనూ రక్షించాలి’’ అని నిలదీసారు. ఆమె వాదనతో కోర్టు
ఏకీభవించింది. ‘‘అవును.. అలా సెలక్టివ్‌గా ఉండకుండా జాగ్రత్తపడాలి’’ అని
న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది నిజాం పాషా, కోర్టు
సూచనలతో ఏకీభవించలేదు. ‘‘కేవలం ముస్లిములు మాత్రమే హత్య చేయబడుతున్నారు. అది
కళ్ళముందున్న నిజం’’ అని వాదించారు.
నిజాం పాషా వాదనకు జస్టిస్ గవాయ్ స్పందించారు.
‘‘కోర్టుకు మీరు ఏం చెబుతున్నారన్న విషయం గురించి జాగ్రత్తగా ఉండండి’’ అని చెప్పారు.
ఆ ప్రజాహిత వ్యాజ్యం విచారణను వేసవి సెలవుల వరకూ,
అంటే జూలై 7 వరకూ వాయిదావేసారు.
ముస్లిములను హత్యలు చేస్తున్నారంటూ ఈ ప్రజాహితవ్యాజ్యాన్ని
సిపిఐ(ఎం) పార్టీ మహిళా విభాగం గత జులైలో దాఖలు చేసింది. ద్వేషపూర్వక నేరాలపై కఠిన
వైఖరి అవలంబించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర, ఒడిషా, బిహార్,
హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పట్టించుకోవడం లేదంటూ సిపిఐ(ఎం)
మహిళావిభాగం ఆరోపణలు చేసింది. దాంతో సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వంతో పాటు ఆ ఆరు
రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందనలు కోరింది. అయితే హర్యానా, మధ్యప్రదేశ్
రాష్ట్రాలు మాత్రమే తమ స్పందనలు కోర్టుకు తెలియజేసాయి. దాంతో సుప్రీంకోర్టు మిగతా
రాష్ట్రాలకు తమ స్పందనలు అందించడానికి మరో ఆరువారాల గడువు ఇచ్చింది.
ఆ సందర్భంగా ఇవాళ జరిగిన విచారణలో కన్హయ్యాలాల్
కేసు గురించి జస్టిస్ అరవింద్ కుమార్ ప్రస్తావించారు.