పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు
రాందేవ్ బాబా ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. గత ఉత్తర్వుల్లో
న్యాయస్థానం ఆదేశాలు తెలుసుకోలేనంత అమాయకులు కారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పును
అంగీకరిస్తూ వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్తూ ప్రకటన ఇవ్వాలని ఆదేశించింది.
పతంజలి ఉత్పత్తుల విషయంలో వినియోగదారులను
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు
సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కోర్టు
ఆదేశాల మేరకు నేటి విచారణకు హాజరైన రాందేవ్ బాబా, బాలకృష్ణ న్యాయస్థానంలో మరోసారి బేషరతుగా క్షమాపణలు తెలిపారు.
తాము చేసింది తప్పిదమేనని భవిష్యత్తులో
ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటామని కోర్టుకు విన్నవించారు. కోర్టు ఆదేశాలను
అగౌరవపర్చే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చారు.
దీని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని
ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
గతంలో ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వుల్లో
ఏం ఉందో తెలుసుకోలేనంత అమాయకులు కాదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. నయం చేయలేని
వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని మీకు తెలియదా అని ప్రశ్నించిన న్యాయస్థానం, మీరు
చేసిది మంచి పనే అయినా అల్లోపతీని తగ్గించి చూపించకూడదని హితవు చెప్పింది. వారం రోజుల్లోగా ఈ విషయంపై బహిరంగ క్షమాపణలు
చెబుతూ ప్రకటన ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్
23కి వాయిదా పడింది.