Kandukuri Veeresalingam, the First Generation Social Reformer
in Andhra Pradesh
(ఇవాళ కందుకూరి వీరేశలింగం జయంతి)
తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి
వీరేశలింగం పంతులు. తెలుగు గడ్డపై తొలితరం సంఘసంస్కర్త ఆయన. మహిళల సంక్షేమం కోసం
జీవితాంతం పనిచేసాడు. స్త్రీవిద్య కోసం ఉద్యమించి బాలికల పాఠశాలను స్థాపించాడు. బాల్యవివాహాలను
వ్యతిరేకించాడు, వితంతు పునర్వివాహాలు చేయించాడు.
కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న
రాజమండ్రిలో జన్మించాడు. ఆయన తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. నాలుగేళ్ళ
పిన్నవయసులోనే వీరేశలింగం తండ్రిని కోల్పోయాడు. నానమ్మ, పెదనాన్నల పెంపకంలో
అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదవయేట బడిలో చేరి బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం,
అమరకోశం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం వంటివి నేర్చుకున్నాడు.
పన్నెండవ యేట ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. పదమూడవ యేట ఆనాటి పద్ధతుల
ప్రకారం ఎనిమిదేళ్ళ బాపమ్మతో వివాహమైంది. తర్వాత ఆమెకు రాజ్యలక్ష్మిగా పేరు మారింది.
విద్యాభ్యాసం పూర్తయాక, పెదనాన్న మరణం తర్వాత,
వీరేశలింగం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. పిల్లలకు పాఠాలతో పాటు సంఘసంస్కరణ భావాలూ
బోధించాడు. సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేసాడు. ఆ క్రమంలో “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ
వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను
సంఘం ముందు పెట్టడం” అనే లక్ష్యాలతో వివేకవర్ధని పత్రికను 1874 అక్టోబరులో
ప్రారంభించాడు.
తెలుగు గడ్డకు బ్రహ్మసమాజాన్ని తీసుకువచ్చింది కందుకూరి వీరేశలింగమే. అలాగే
యువజన సంఘాల స్థాపన కూడా తెలుగునాట ఆయనతోనే మొదలైంది. సమాజసేవ చేయాలనే సంకల్పంతో
1905లో హితకారిణీ సమాజాన్ని స్థాపించి తన ఆస్తి మొత్తాన్నీ ఆ సమాజానికే రాసిచ్చేసాడు.
పాతికేళ్ళు రాజమండ్రిలోనూ, ఐదేళ్ళు మద్రాసులోనూ తెలుగు పండితుడిగా పనిచేసాడు.
కందుకూరి వీరేశలింగం యుగకర్తగా ఖ్యాతి గడించాడు, గద్యతిక్కన అనే బిరుదు
గడించాడు. సంఘసంస్కరణ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, సంఘాన్ని సంస్కరించే పనిని
సాహిత్యం ద్వారానూ కొనసాగించాడు. అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వోద్యోగాన్నీ,
అబద్ధాలు ఆడకూడదని న్యాయవాద వృత్తినీ వదులుకున్న మహనీయుడు కందుకూరి. సాంఘిక
దురాచారాలపై తన వివేకవర్థిని పత్రిక ద్వారా యుద్ధమే చేసాడు. స్త్రీవిద్య కావాలి
అని నినాదాలు చేయడం మాత్రమే కాదు, దాన్ని సాధించడం కోసం బాలికా విద్యాలయం
ప్రారంభించిన మహనీయుడు ఆయన.
బాలబాలికలకు సహవిద్యా పద్ధతిని తీసుకొచ్చిందీ ఆయనే. తానే స్వయంగా పిల్లలకు
పాఠాలు బోధించేవాడు. అంటరాని కులాల పిల్లలను సైతం చేరదీసి, వారిని అందరితో సమానంగా
కూర్చోబెట్టి, వారికి పుస్తకాలు పలకాబలపాలు సమకూర్చి చదువు చెప్పాడు.
కులనిర్మూలనకు ఎంతో కృషి చేసాడు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పనిచేసాడు. వేశ్యా
వ్యవస్థకు వ్యతిరేకంగా తన వివేకవర్ధని పత్రికలో ఎన్నో వ్యాసాలు రాసాడు.
కందుకూరి పేరు చెబితే గుర్తొచ్చేది వితంతు పునర్వివాహాలు. బాల్యంలోనే
వితంతువులయ్యే ఆడపిల్లల భవిష్యత్తు నాశనమైపోకూడదనే ఉద్దేశంతో వారికి పునర్వివాహాలు
చేయించాలని ప్రచారం చేసాడు. తానే స్వయంగా వితంతు పునర్వివాహాలు జరిపించాడు. 1881
డిసెంబర్ 11న మొదటి వితంతు పునర్వివాహం తన ఇంట్లోనే చేయించాడు. మొత్తం 40 వితంతు
పునర్వివాహాలు చేయించాడు. వీరేశలింగం సంఘసంస్కరణ కార్యక్రమాలకూ ఆయన భార్య రాజ్యలక్ష్మి,
ఆయన విద్యార్ధులు, మిత్రులు సహకరించేవారు.
కందుకూరి సంఘసేవలో ఎంత కృషి చేసారో, సాహిత్యరంగంలో అంతకంటె ఎక్కువే కృషి
చేసాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ఆయన నిష్ణాతుడు. తన భావాలను సమాజంలో
వ్యాపింపజేయడానికి ఎన్నో పత్రికలు ప్రారంభించి నిర్వహించాడు. రాజశేఖర చరిత్రము అనే
నవల, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, ఆంధ్ర కవుల చరిత్ర వంటి ప్రఖ్యాతి గడించిన రచనలు సహా
130కి పైగా పుస్తకాలు రచించాడు. సంగ్రహ వ్యాకరణం రాసాడు. నీతిచంద్రిక పేరుతో
చిన్నయసూరి తెలుగులో మొదలుపెట్టిన పంచతంత్రాన్ని పూర్తి చేసాడు. ఇక ఆయన ప్రహసనాలు
సమాజంలో గొప్పపేరు గడించాయి.
తెలుగు సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన కందుకూరి వీరేశలింగం 1919 మే 27న తుదిశ్వాస
విడిచాడు. ఆయన గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం చెప్పిన పద్యం ఆయన సమాధి మీద
ఈనాటికీ నిలిచి ఉంది.
‘‘తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకే వినియోగించిన
ఘనుడీ వీరేశలింగ కవి జనులార’’