Tamil Nadu to face polling in first phase for Lok Sabha elections
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న
జరగనుంది. అంటే ఆ దశలో ఎన్నికలు జరిగే 102 నియోజక వర్గాల్లో ప్రచారం రేపు బుధవారం
సాయంత్రం ముగుస్తుంది. ఈ దశలో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో
పోలింగ్ జరగబోతోంది. వాటన్నింటిలోనూ ఎక్కువ స్థానాల్లో పోలింగ్ జరిగేది తమిళనాడులోనే.
ఆ రాష్ట్రంలో మొత్తం 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాటన్నిటికీ వచ్చే శుక్రవారం నాడే
పోలింగ్ జరుగుతుంది. ఆ నేపథ్యంలో తమిళ రాజకీయం ఎలా ఉండబోతోందో ఒకసారి
పరిశీలిద్దాం.
తమిళనాడులో ఈసారి ప్రధానంగా మూడు కూటముల మధ్య
ఎన్నికల పోరు జరగనుంది.
ఇండీ కూటమిలో ద్రవిడ మున్నేట్ర కళగం-డిఎంకె 21
సీట్లలో అభ్యర్ధులను మోహరించింది. కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి-కెఎండికె 1
స్థానంలో డిఎంకె గుర్తుతోనే బరిలోకి దిగుతోంది. భారత జాతీయ కాంగ్రెస్ 9 సీట్లలో, సిపిఐ
2, సిపిఐ(ఎం) 2, విడుదలై చిరుత్తైగల్ కచ్చి-విసికె 2, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్
1, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం-ఎండిఎంకె 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి.
అన్నాడీఎంకే కూటమిలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ
మున్నేట్ర కళగం-ఎఐఎడిఎంకె 32 సీట్లలో పోటీ చేస్తోంది. పుదియ తమిళగం పార్టీ, సోషల్
డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చెరో స్థానంలో అన్నాడిఎంకె గుర్తుతోనే పోటీ పడుతున్నాయి.
దేశీయ మర్పోక్కు ద్రవిడ కళగం-డిఎండికె 5 స్థానాల్లో బరిలో నిలుస్తోంది.
ఇక ఎన్‌డిఎ కూటమిలో భారతీయ జనతా పార్టీ-బిజెపి 19
స్థానాల్లో బరిలో నిలబడుతోంది. ఇందీయ జననాయగ కచ్చి-ఐజెకె, ఇందీయ మక్కల్ కల్వి
మున్నేట్ర కళగం-ఐఎంకెఎంకె, పుదియ నీది కచ్చి-పిఎన్‌కె, తమిళగ మక్కల్ మున్నేట్ర
కళగం-టిఎంఎంకె తలా ఒక స్థానంలో బిజెపి గుర్తు మీద పోటీపడతాయి. అన్బుమణి రాందాస్‌కు
చెందిన పట్టాళి మక్కల్ కచ్చి-పిఎంకె 10 సీట్లలో పోటీ పడుతోంది. తమిళ మానిల
కాంగ్రెస్-టిఎంసి 3, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం-ఎఎంఎంకె 2 చోట్ల, అన్నాడిఎంకె
నుంచి బహిష్కృతుడైన ఒ పనీర్ సెల్వం
స్వతంత్ర అభ్యర్ధిగా 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి.
2014 పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయభేరి
మోగించింది. జయలలిత నేతృత్వంలో ఆ పార్టీ మొత్తం 37 స్థానాలు సాధించింది.
మిత్రపక్షాలు బిజెపి 1 సీటు, పిఎంకె 1 సీటు గెలుచుకున్నాయి. ఇక కరుణానిధి
నేతృత్వంలోని డిఎంకె ఒక్కటంటే ఒక్క స్థానంలోనైనా విజయం సాధించలేకపోయింది.
2019 లోక్‌సభ ఎన్నికల నాటికి జయలలిత, కరుణానిధి
ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. అప్పటి ఎన్నికల్లో యుపిఎ కూటమి 37 స్థానాల్లో విజయం
సాధించింది. ఎన్‌డిఎ కూటమిలో అన్నాడిఎంకె ఒకే ఒక స్థానంలో గెలిచింది.
2024లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇండీ కూటమే
గెలుస్తుందని అత్యధిక సర్వేలు చెబుతున్నాయి. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఇండీ కూటమి
30-36 సీట్లు, అన్నాడిఎంకె 3-6 సీట్లు, ఎన్‌డిఎ కూటమి గరిష్టంగా 1 సీటు, ఇతరులు
గరిష్టంగా 2 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. పుదియ తలైమురై సర్వే అంచనా ప్రకారం
ఇండీ కూటమి 29-31, అన్నాడిఎంకె 4-6, ఎన్‌డిఎ 4-6, ఇతరులు గరిష్టంగా 2 స్థానాలు
గెలుచుకోవచ్చు. ఇండియా టుడే, ఎబిపి న్యూస్ సర్వేలు మొత్తం 39 స్థానాల్లోనూ ఇండీ
కూటమి అభ్యర్ధులే గెలుస్తారని అంచనా వేస్తున్నాయి. ఇండియా టివి సర్వే ఇండీ కూటమి 26,
అన్నాడిఎంకె 4, ఎన్‌డిఎ కూటమి 4, ఇతరులు 5 స్థానాలు గెలుస్తాయని అంచనా వేసింది.
అయితే తమిళనాడులో బీజేపీకి
కొత్తఊపు తెచ్చిన అన్నామలై, తమ కూటమి రెండంకెల స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని,
మిగతా స్థానాల్లో రెండో స్థానంలో నిలుస్తామనీ చెబుతున్నారు. ఈ ఎన్నికలతో
అన్నాడిఎంకె రాష్ట్రం నుంచి కనుమరుగవుతుందని, ఆ ఖాళీని బిజెపి పూరిస్తుందనీ ఆయన ధీమా
వ్యక్తం చేస్తున్నారు.