UN worried about strikes on nuclear sites, in Iran-Israel war
ఇజ్రాయెల్ మీద ఇరాన్ నేరుగా దాడి చేయడంతో
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పెచ్చుమీరాయి. తమ దేశంపై అనూహ్య దాడికి
పాల్పడిన ఇరాన్‌ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ
పరిణామాలతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని గ్రహించిన ప్రపంచ దేశాల నాయకులు మాత్రం సహనం
వహించాలంటూ సూచిస్తున్నారు.
ఇరాన్ దాడికి స్పందించే విషయంలో సహనం చూపించాలంటూ
ఇజ్రాయెల్ మీద మిత్రదేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. తద్వారా మధ్యప్రాచ్య ప్రాంతంలో
ఘర్షణలు పెరగకుండా నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ దేశపు అణుకేంద్రాలే లక్ష్యంగా
దాడులు చేస్తుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతోంది. ఐరాసకు చెందిన అంతర్జాతీయ
అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాసీ, ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్
దాడులు చేసే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు.
ఈ నెల మొదట్లో సిరియా రాజధాని డమాస్కస్ మీద
ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ దాడిలో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం ధ్వంసమైంది.
దానికి ప్రతీకారంగా కొద్దిరోజుల క్రితం ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది.
దాంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
సోమవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్
నెతన్యాహు తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఇరాన్ దాడి తర్వాత ఏం చేయాలన్న విషయం
గురించి విస్తృతంగా చర్చించారు. ఇరాన్ దాడికి తప్పకుండా జవాబు చెప్పాల్సిందేనని
ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అభిప్రాయపడ్డారు.
ఇరాన్ దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతామండలి
ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఏ క్షణమైనా యుద్ధం
జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ, అక్కడ ఉద్రిక్త పరిస్థితులను తొలగించాలనీ ఐరాస
ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ హెచ్చరించారు.
ఇరాన్ దాడిని ఎదుర్కోడానికి సహాయపడిన అమెరికా
అధికారులు, ఇజ్రాయెల్‌ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. ఇరాన్‌పై ప్రతిఘటనకు ఎలాంటి
సైనిక సహాయమూ చేయబోమని జో బైడెన్ నెతన్యాహుకు స్పష్టం చేసారు.
మధ్యప్రాచ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారతదేశం
జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఉద్రిక్తతలను చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే
పరిష్కరించుకోవాలని భారత్ అభిప్రాయపడింది. ‘ఇరుపక్షాలూ ఆయుధాలను పక్కన పెట్టాలి,
సహనం వహించాలి. హింసాకాండను ఆపివేయాలి. సమస్యను దౌత్యపద్ధతిలో పరిష్కరించుకోవాలి’ అని
భారత విదేశాంగశాఖ ఒక ప్రకటన ద్వారా సూచించింది.
ఇరాన్ శనివారం రాత్రి 300కు పైగా డ్రోన్లు,
క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. వాటన్నింటినీ నిలువరించగలిగినట్లు
ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఆ వ్యవహారం అక్కడితో ముగిసిందని తాము భావిస్తున్నట్లు
ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ మరొక తప్పు చేస్తే తమ స్పందన మరింత తీవ్రంగా
ఉంటుందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ప్రతినిధుల బృందం వెల్లడించింది.
ఇజ్రాయెల్-ఇరాన్
ఉద్రిక్తతలకు మూలకారణం గాజా యుద్ధంలో ఉన్నాయి. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ గాజా
ప్రాంతంపై యుద్ధం ప్రకటించింది. ఆనాటి నుంచీ ఇజ్రాయెల్‌కు… లెబనాన్, సిరియా,
యెమెన్, ఇరాక్‌లలోని ఇరాన్ అనుకూల వర్గాలకూ మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి.