శ్రీరామ
నవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వార్లను భక్తులు ఉచితంగా
దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. నవమి ఒక్క రోజు మాత్రమే
ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి,
అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది.
వేలాదిమంది భక్తులు తిలకించి, అనుగ్రహం పొందే సంబురం ఈ క్రతువు. సీతారాముల గుణాలను వివరించే తీరు
మంత్రముగ్ధులను చేస్తుంది.
ఈ
ఏడాది ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేది ప్రభుత్వ
ఉన్నతాధికారులేనని సమాచారం. ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలుస్తోంది.
భద్రాద్రి
శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాదాయ,
పౌరసంబంధాల శాఖ అధికారులు తెలిపారు. బుధవార నాడు సీతారాముల కళ్యాణం నిర్వహించనుండగా, గురువారం పట్టాభిషేక
మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
కళ్యాణోత్సవం సందర్భంగా మిథిలా స్టేడియంలో చలువ
పందిళ్ళు వేశారు. తాగునీరు, మజ్జిగ కేంద్రాలు
ఏర్పాటు చేసి ఇతర సదుపాయాలు కల్పించారు. స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించి
భక్తులు కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేలా
ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
శ్రీరామ
నవమి, పట్టాభిషేకం వేడుకలకు రెండు వేల మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.