Gujarat couple donates Rs 200 croresto
become monks
గుజరాత్‌కు చెందిన ఒక జైన దంపతులు సుమారు రూ.200
కోట్ల సంపదను దానం చేసేసారు. ఎందుకంటే, ముక్తిమార్గం సాధించడానికి. సన్యాసదీక్ష తీసుకునే
సందర్భంలో వారు తమ సంపద మొత్తాన్నీ విరాళాలుగా ఇచ్చేసారు. ఫిబ్రవరిలో వారు తమ
సంపదను దానం చేసేయగా, ఈ నెలాఖరులో సన్యాసదీక్ష తీసుకోనున్నారు.
భవేష్ భండారీ హిమ్మత్‌నగర్ ప్రాంతానికి చెందిన
వ్యాపారవేత్త. ఆయన భవన నిర్మాణ రంగంలో ఉండేవారు. భవేష్ దంపతులకు 19ఏళ్ళ కూతురు, 16ఏళ్ళ
కొడుకు ఉన్నారు. వారిద్దరూ 2022లో సన్యాసదీక్ష తీసుకున్నారు. తమ పిల్లలను
అనుసరిస్తూ భవేష్ దంపతులు కూడా ఇప్పుడు సన్యాసదీక్ష స్వీకరిస్తున్నారు. ‘పిల్లల
నుంచి స్ఫూర్తి పొందిన భవేష్ దంపతులు తమ భౌతిక సంపదలను వదులుకుని ఆధ్యాత్మిక
మార్గాన్ని ఎంచుకున్నారు’ అని వారి ధర్మానికి చెందిన వ్యక్తులు చెప్పారు.
భవేష్ దంపతులు ఈ నెల 22న సన్యాసదీక్ష
తీసుకుంటారు. అప్పటినుంచీ వారు అన్ని కుటుంబ బంధాలనూ తెంచేసుకోవాలి. వారు తమతో
ఇకపై ఎలాంటి భౌతిక వస్తువులనూ ఉపయోగించకూడదు. వారు దేశమంతా చెప్పులు లేకుండా
కాలినడకన తిరగాలి. భిక్షాటన చేసుకుని, వచ్చినదాన్ని తిని బతకాలి.
ఈ దీక్ష తీసుకున్న వ్యక్తుల వద్ద ఒక జత తెల్లని
దుస్తులు, భిక్షాపాత్ర, రాజోహరణ్ అని పిలిచే చీపురు మాత్రమే ఉంటాయి. జైన ధర్మంలో
అహింసా నియమాన్ని బాగా పాటిస్తారు. అందులో భాగంగా, వారు కూర్చునే చోట పురుగులు ఏమీ
లేకుండా తుడుచుకోవడం కోసం చీపురును మాత్రం తమతో ఉంచుకుంటారు.
భవేష్ భండారీ జంట తీసుకున్న నిర్ణయం గుజరాత్లో
విస్తృత ప్రచారం పొందింది. రాష్ట్రంలోని ధనిక కుటుంబాల్లో వారిది ఒకటి మరి. గతంలో
ఇలా కోట్ల ఆస్తిని వదులుకున్నవారిలో భవర్లాల్ జైన్ ఒకరు.
భవేష్ భండారీ జంట ఒక ఊరేగింపు చేపట్టారు. తమ
మొబైల్ ఫోన్లు, ఎయిర్ కండిషనర్లు సహా తమ సంపద అంతటినీ ఆ నాలుగు కిలోమీటర్ల
ఊరేగింపులో పంచిపెట్టేసారు.