Unidentified assailants shot down Sarabjeet murderer in Pakistan
భారతీయ గూఢచారి అన్న అనుమానంతో పాకిస్తాన్లో నిర్బంధించబడి,
ఖైదులో ఉండగానే హత్య చేయబడిన సరబ్జీత్సింగ్ గుర్తున్నాడా? అతని హత్యకేసులో ఒక నిందితుడు
అమీర్ సర్ఫరాజ్ తాంబాను గుర్తుతెలియని వ్యక్తులు లాహోర్‌లో కాల్చి చంపారు.
తాంబా,
లష్కరే తయ్యబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. లష్కరే సంస్థ
భారతదేశంలో నిర్వహించిన ఎన్నో విధ్వంస కార్యకలాపాల్లో తాంబా పాత్ర కూడా ఉంది.
లాహోర్‌లోని ఇస్లాంపురా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఒక మోటర్‌సైకిల్ మీద వచ్చి
తాంబాను కాల్చేసారు. అతన్నివెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అప్పటికే అతని పరిస్థితి
విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కొద్దిసేపటికే తాంబా ప్రాణాలు కోల్పోయాడు. తాంబాను
కాల్చి చంపినవారిని వెతకడం కోసం పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్నీ సీల్ చేసారు.
సరబ్జీత్
సింగ్ భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని భిఖివిండ్ పట్టణానికి చెందిన రైతు.
భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో నివసించేవాడు. ఒకసారి ప్రమాదవశాత్తు
సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి వెళ్ళాడు. అతన్ని పాకిస్తానీ సైనికులు నిర్బంధించారు.
పాకిస్తాన్ కోర్టు అతనికి 1991లో మరణ శిక్ష విధించింది. అతను లాహోర్‌లోని కోట్‌లఖ్‌పత్
జైలులో 22 ఏళ్ళు మగ్గిపోయాడు. అతన్ని విడిపించడానికి భారత్ చేసిన ప్రయత్నాలేవీ
ఫలించలేదు. 2013లో అతన్ని జైలులోని తోటి ఖైదీలు ఇటుకలు, ఇనుప ఊచలతో చితక్కొట్టారు.
ఐదు రోజులు కోమాలో ఉండి, సరబ్జీత్ లాహోర్‌లోని జిన్నా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.
సరబ్జీత్
కథను సినిమాగా తీసిన రణదీప్ హూడా, ఈ వార్తను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇక
సరబ్జీత్ కుటుంబం అతన్ని చంపిన మిగతా హంతకులకు కూడా శిక్ష పడాలని
కోరుకుంటున్నారు.