Uttar Pradesh to see triangular fight in
first phase Lok Sabha polls
దేశంలోకెల్లా అతిఎక్కువ లోక్‌సభ నియోజకవర్గాలున్న
రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ గెలిచే పార్టీయే దేశాన్ని పరిపాలిస్తుందన్నది
ఇప్పటివరకూ నిరూపణ అయిన సత్యం. యూపీలో మొత్తం 80 లోక్‌సభ సీట్లున్నాయి. ఈసారి
ఎన్నికలు జరిగే ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్‌లో అన్ని దశల్లోనూ పోలింగ్ జరగనుంది.
ఏప్రిల్ 19న జరిగే మొదటి దశ పోలింగ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని
8 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఆ దశలో
1.5 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. సహారన్పూర్, కైరానా,
ముజఫర్‌నగర్, బిజ్నౌర్, నగీనా, మురాదాబాద్, రాంపూర్, పీలీభీత్ నియోజకవర్గాల్లో
మరో రెండురోజుల్లో ప్రచారపర్వం ముగిసిపోతుంది. కొన్ని చిన్న ప్రాంతీయ పార్టీలు సహా
జాతీయ పార్టీలు అక్కడ పోటీ పడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ ఎనిమిది నియోజకవర్గాల్లోనూ
7 చోట్ల ముక్కోణపు పోటీ కనబడుతోంది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ,
భారతీయ జనతా పార్టీల మధ్య పోరు జరగనుంది. నగీనా నియోజకవర్గంలో మాత్రం నాలుగు
పార్టీల మధ్య పోటీ ఉండబోతోంది. అక్కడ భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్
కూడా బరిలో దిగుతున్నారు.
మొదటి దశ ఎన్నికలు జరగనున్న ఎనిమిది సీట్లలో
ఎక్కువ చర్చనీయాంశంగా నిలిచినది రాంపూర్ స్థానం. అక్కడ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి
మౌలానా మొహిబ్బుల్లా నద్వీ ప్రచారం ప్రారంభించేటప్పుడే ఆ పార్టీలో లుకలుకలు
బైటపడ్డాయి. ఆజంఖాన్ అనుచరులు నద్వీకి వ్యతిరేకంగా నిలిచారు. ఆజంఖాన్ సన్నిహితుడైన
వీరేంద్ర గోయల్, అక్కడ బీఎస్పీ అభ్యర్ధి జీషాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచారు.
ప్రచారం ముగియడానికి ఇంక రెండు రోజులు మాత్రమే మిగిలున్నా సమాజ్‌వాదీ పార్టీ
అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాంపూర్‌లో ప్రచారం చేయనే లేదు. ఎస్పీకి చెందిన
మొహిబ్బుల్లా నద్వీ, బీఎస్పీకి చెందిన జీషాన్ ఖాన్, బీజేపీ అభ్యర్ధి ఘనశ్యామ్ సింగ్
లోధీ మధ్య ముక్కోణపు పోరులో చిన్నచిన్న రాజకీయ పార్టీలు ఎస్పీ లేదా బీజేపీకి
మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ అభ్యర్ధిని ప్రకటించాక అక్కడ బీజేపీ
అభ్యర్ధికి బలం పెరిగిందని సమాచారం.
ఇక పీలీభీత్ నియోజకవర్గం సంగతి చూస్తే అక్కడ
బీజేపీ తమ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వనేలేదు. యోగి ఆదిత్యనాథ్
క్యాబినెట్లో మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద్‌కు సీటిచ్చారు. ఆయన స్వయంగా
క్షేత్రంలోకి దిగి గ్రామగ్రామాలన్నీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇక సమాజ్‌వాదీ
పార్టీ తరఫున భగవత్ సరణ్ గంగ్వార్, బీఎస్పీ తరఫున అనీస్ అహ్మద్ ఖాన్ (ఫూల్బాబు) బరిలో
ఉన్నారు.
మొదటి దశ ఎన్నికల
ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తమ అభ్యర్ధుల కోసం ప్రచారం
ప్రారంభించాక ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. అలాగే బీఎస్పీ తరఫున ఆ
పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, జాతీయ సమన్వయకర్త ఆకాష్ ఆనంద్ చేస్తున్న భారీ
ఎన్నికల వాగ్దానాలతో రాష్ట్రంలో ఎన్నికల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అక్కడ
బీజేపీ, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి) మధ్య పొత్తు ఉన్నందున అన్ని సీట్లలోనూ
వారి ప్రచారం రెండింతలుగా జరుగుతోంది.