How Ambedkar was defeated in 1952 election
ఏప్రిల్ 14, అంబేద్కర్ జయంతి సందర్భంగా
దేశవ్యాప్తంగా ఆయనకు ఘననివాళులు అర్పించారు. దేశంలో సామాజిక అసమానతలను రూపుమాపిన మహానుభావుడిగా
అంబేద్కర్‌కు పార్టీలకు అతీతంగా అందరూ శ్రద్ధాంజలి ఘటించారు. అయితే దేశ
రాజకీయాల్లో ఆయనకు మనుగడ లేకుండా పోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందంటే నమ్మగలరా? 1952
ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమి, దేశ ప్రధాన నేతల కుట్ర ఫలితమేనన్న సంగతి తెలుసా?
1952 ఎన్నికల సమయంలో డాక్టర్ అంబేద్కర్, జవాహర్‌లాల్
నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి, ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి పోటీ
చేసారు. కానీ ఆయనకు నెహ్రూగారి కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన వ్యతిరేకత
ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి నారాయణ్ కజ్రోల్కర్ అనే
పాలవ్యాపారిని బరిలోకి దింపింది. అంతేకాదు, కమ్యూనిస్టు పార్టీ జాతీయ నేత శ్రీపాద
అమృత డాంగే బహిరంగంగానే అంబేద్కర్‌ను మోసగాడు అనే ముద్ర వేసి ఆయనకు వ్యతిరేకంగా
ప్రచారం చేసారు.
ఆ ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగింది.
స్వయానా నెహ్రూయే ముంబైని రెండుసార్లు సందర్శించి, అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ప్రచారం
చేసారు. ఆ దళిత నేతను అవమానపరిచేలా డాంగే కరపత్రాలు పంచిపెట్టారు. అంతేకాదు, ఆ
ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించేందుకు తప్పుడు పద్ధతులు అవలంబించారని కూడా
తెలుస్తోంది. పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్, ఓట్లను రద్దు చేయడం వంటి దుశ్చర్యలకు
పాల్పడ్డారని సమాచారం. అంబేద్కర్ ఆ ఎన్నికల్లో సుమారు 14వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం
పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో దాదాపు 78వేల ఓట్లను
చెల్లబోవంటూ రద్దు చేసారు.
డాక్టర్ అంబేద్కర్ జీవితచరిత్ర రాసిన ధనంజయ్ కీర్
అందులో అంబేద్కర్ ఎన్నికల ప్రస్థానం గురించి విపులంగా రాసారు. ఆ ఎన్నికల ఫలితాలు
నమ్మలేకపోయాననీ, దిగ్భ్రాంతి చెందాననీ కీర్ రాసుకొచ్చారు. తన ఓటమిపై విచారణ
జరిపించాలని అంబేద్కర్ ఎన్నికల అధికారిని కోరారు. ముంబై అంతటా ప్రజలు తనకు
మద్దతిచ్చారనీ, అలాంటి కుట్రల వల్ల ప్రజలు తనకిచ్చిన మద్దతు వృధా అయిపోయిందని
అంబేద్కర్ ఆవేదన చెందారు.
అంబేద్కర్ అనుమానాలకు మద్దతు పలుకుతూ సోషలిస్టు
నాయకుడు జయప్రకాష్ నారాయణ కూడా ఎన్నికల ఫలితాల సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేసారు.
ఆ ఫలితాలను మరొకసారి పరిశీలించాలని డిమాండ్ చేసారు. స్వయంగా అంబేద్కరే, తన ఓటమికి
కారణం కమ్యూనిస్టుఅగ్రనేత శ్రీపాద అమృత డాంగే కుట్ర అని ప్రకటించారు. దాంతో ఆ
ఎన్నికల మీద వివాదం మరింత ముదిరింది.
1952 ఎన్నికల్లో ఉత్తర ముంబై నియోజకవర్గంలో అంబేద్కర్
ఓటమితో, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు మరింత బలం పుంజుకున్నాయి. డాంగే
నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీలు అంబేద్కర్ విజయావకాశాలను దెబ్బతీయడం కోసం మోసపూరిత
విధానాలు అవలంబించాయన్న ఆరోపణలు తలెత్తాయి. ఆ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఏకంగా
78వేల ఓట్లు రద్దయిపోయాయి. దానిపై అంబేద్కర్ కోర్టులో కేసు కూడా వేసారు. తనకు
వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసారనీ, ఎన్నికల ఫలితాలు సరైనవి కావనీ ఆయన
ఆరోపించారు. ఆ ఎన్నికల్లో అంబేద్కర్‌కు జరిగిన అన్యాయం గురించి, స్వతంత్ర
భారతదేశంలో ఎన్నికల మోసాలకు బలైన మొదటి బాధితుడు అంబేద్కర్ అన్న విషయాన్ని అంతర్జాతీయ
ప్రఖ్యాతి గడించిన అమెరికన్ రచయిత్రి గెయిల్ ఓంవెట్ తన రచన ‘అంబేద్కర్ :
టువార్డ్స్ ఏన్ ఎన్‌లైటెన్డ్ ఇండియా’లో వివరించారు. ఆ ఎన్నికల ఫలితాల విషయంలో అంబేద్కర్
ఆవేదన న్యాయపోరాటానికే పరిమితం కాలేదు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా
దెబ్బతీసింది.
1952 ఎన్నికల ఓటమి తర్వాత అంబేద్కర్ ఆరోగ్యం చాలా
వేగంగా పతనమైపోయింది. రాజకీయ ఎదురుదెబ్బలు ఆయనను మానసికంగా క్రుంగదీసాయి.
ఎన్నికల్లో ఓటమి అంబేద్కర్ మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎంతటి దుష్ప్రభావం చూపిందో
ఆయన భార్య సావిత్రీబాయి అంబేద్కర్ తన మిత్రురాలికి రాసిన లేఖలో వివరిస్తూ తీవ్ర
ఆవేదన చెందారు. అంబేద్కర్‌కు రాజకీయ వ్యవస్థతోనూ, పార్లమెంటరీ కార్యకలాపాలతోనూ
అంతులేని అనుబంధం ఉందనీ, ఆయనకు బలాన్నిచ్చేది రాజకీయ వ్యవస్థేననీ, దానినుంచి
దూరమవడం అంబేద్కర్ ఆరోగ్యాన్ని చాలా వేగంగా దెబ్బతీసిందనీ సావిత్రి రాసుకొచ్చారు.
అనారోగ్యంతోనూ, నిరాశతోనూ పెనగులాడుతున్నా
అంబేద్కర్ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలనే భావించారు. మహారాష్ట్రలోని భండారా
నియోజకవర్గానికి 1954లో జరిగిన ఉపయెన్నికల్లో పోటీ చేసారు. కానీ అప్పుడు కూడా విధి
ఆయనకు సహకరించలేదు. కాంగ్రెస్ తన బలీయమైన ప్రభావాన్ని ప్రయోగించి అంబేద్కర్‌ను
మరోసారి ఓడించింది. రెండు ఎన్నికల్లో వరసగా ఓటమి పాలవడం అంబేద్కర్‌ను నిలువునా
కుంగదీసేసింది. ఫలితంగా ఆయన ఆరోగ్యం ఇంక కుదుటబడలేదు. ఆ ఆవేదనతోనే ఆయన జీవితం 1956
డిసెంబర్ 6న కడతేరిపోయింది.
భారతదేశపు ప్రజాస్వామ్య
ముఖచిత్రంపై అణగారిన వర్గాల వారి స్వరాలకు ఎదుర్కొనే ఆటంకాలకు – ఎన్నికల్లో అంబేద్కర్
పడిన అవస్థలే నిదర్శనంగా నిలిచాయి. ఎన్ని ఆటంకాలు, అవాంతరాలూ ఎదురైనా న్యాయం కోసం,
సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన నిరంతర ప్రయత్నాలు ఆయన అంతులేని సహనానికి, నిరంతరాయంగా
ప్రయత్నం చేస్తూనే ఉండాలన్న స్ఫూర్తికీ నేటికీ నిలుస్తున్నాయి. ఎన్నికల్లో ఆయనంతటి
గొప్ప వ్యక్తే ఓటమి పాలవడం భారత ప్రజాస్వామ్యపు నైతిక విలువల పతనానికి నిదర్శనంగా
నిలిచింది.