కుక్కల దాడితో హైదరాబాద్ నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా జరిగిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని పేట్‌బషీరాబాద్ పరిధిలో రెండున్నరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. చిన్నారి తల్లిదండ్రులు సమీపంలోని భవన నిర్మాణ సంస్థలో కూలీలుగా చేస్తున్నారు. కుటుంబంతో కలసి అక్కడే రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు.
చిన్నారి దీప్‌కుమారి వారు నివాసం ఉండే షెడ్డు వద్ద ఆడుకుంటుండగా కుక్కలన్నీ ఒకేసారి దాడిచేశాయి. రెండు కుక్కలు దాడికి దిగడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని కుక్కలు కొంచెం దూరం లాక్కెళ్లాయి. తల్లిదండ్రులు గుర్తించి కుక్కలను తరిమి, చిన్నారిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు తక్కలేదు. చికిత్స మొదలు పెట్టక ముందే చనిపోయినట్లు నిలోఫర్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.