CBI tells Special Court that Kavita threatened to donate Rs 25 crores to AAP
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్
నాయకురాలు కల్వకుంట్ల కవిత గురించి ప్రత్యేక న్యాయస్థానంలో సిబిఐ వెల్లడించింది.
ఢిల్లీ ప్రభుత్వపు ఎక్సైజ్ విధానంలో భాగంగా తమ సంస్థకు ఐదు రిటెయిల్ జోన్లు
కేటాయించినందుకు రూ.25కోట్లు చెల్లించాలని అరొబిందో ఫార్మా ప్రమోటర్ శరత్‌చంద్రారెడ్డిని
కవిత బెదిరించారట. అలా ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.25కోట్లు చెల్లించకపోతే, శరత్‌చంద్రారెడ్డికి
ఢిల్లీలోను, తెలంగాణలోనూ ఉన్న వ్యాపారాలు దెబ్బతింటాయని కవిత చెప్పారట.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన
మనీలాండరింగ్ కేసులో శరత్‌చంద్రారెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఈడీ విచారిస్తున్న ఆ
కేసులో శరత్ అప్రూవర్‌గా మారారు. ఆయన మీద సీబీఐ ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదు.
కవితను కస్టోడియల్ విచారణకు అప్పగించాలని కోరిన సిబిఐ,
ఆ సందర్భంగా శుక్రవారం కోర్టులో… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అయిన కవిత పట్టుపట్టడం,
హామీలివ్వడం వల్లనే శరత్‌చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లోకి ప్రవేశించారని…
ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు చెప్పింది. తనకు ఢిల్లీ ప్రభుత్వంలోని
పెద్ద తలకాయలతో కాంటాక్ట్‌లు ఉన్నాయనీ, అక్కడ మద్యం వ్యాపారంలో సాయం చేస్తాననీ
కవిత శరత్‌చంద్రారెడ్డికి హామీ ఇచ్చారని సిబిఐ చెప్పింది.
‘‘మద్యం వ్యాపారం కాంట్రాక్ట్ దక్కడానికి హోల్‌సేల్
వ్యాపారానికి రూ.25 కోట్లు, ఒక్కొక్క రిటెయిల్ జోన్‌కూ రూ.5 కోట్లు చొప్పున ఆమ్ ఆద్మీ
పార్టీకి చెల్లించాలని కవిత శరత్‌చంద్రారెడ్డికి చెప్పారు. ఆ మొత్తాన్ని తన
భాగస్వాములైన అరుణ్ పిళ్ళై, అభిషేక్ బోయినపల్లికి చెల్లించాలని, వారు అరవింద్
కేజ్రీవాల్ ప్రతినిధి అయిన విజయ్ నాయర్‌తో సమన్వయం చేస్తారనీ ఆమె శరత్‌కు
వివరించారు’’ అని సిబిఐ వెల్లడించింది.
మరోవైపు, ఢిల్లీ మద్యం పాలసీని అనుసరించి కేటాయింపులు
తమకు అనుకూలంగా జరుగుతాయని కవిత హామీ ఇవ్వడంతో ఆమెకు చెందిన ‘తెలంగాణ జాగృతి’
సంస్థకు శరత్‌చంద్రారెడ్డికి చెందిన అరొబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, మార్చి 2021లో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ సాకుతో
రూ.80లక్షలు చెల్లించిందని కూడా సిబిఐ ప్రత్యేక కోర్టుకు తెలియజేసింది.
సిబిఐ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం,
కల్వకుంట్ల కవితను ఏప్రిల్ 15 వరకూ సిబిఐ కస్టడీకి అప్పగించింది.