ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏప్రిల్ 15న విచారణకు రానుంది. న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, సంజీవ్ ఖన్నాల ధర్మాసనం కేజ్రీవాల్ కేసు విచారించనుంది. మద్యం పాలసీని కొందరికి అనుకూలంగా రూపొందించి మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మనీలాండరింగ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారనడానికి తగిన ఆధారాలున్నాయని ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు ఇప్పటికే వినిపించారు. అరెస్టును అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 గోవా ఎన్నికల్లో మనీలాండరింగ్ ద్వారా రూ.45 కోట్లు తరలించారని, అప్రూవర్‌గా మారిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఖచ్ఛితమైన సమాచారం తమ వద్ద ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు.