సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్రంలోని అధికార బీజేపీ మ్యానిఫెస్టోను సిద్దం చేసింది. ఇప్పటికే చాలా పార్టీలు మ్యానిఫెస్టోను విడుదల చేశాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 400పైగా ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ కసరత్తు చేసింది. బీజేపీని మరోసారి గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నారో తెలియజేస్తూ రూపొందించిన సంకల్ప పత్రం విడుదలకు సిద్ధమైంది.
మ్యానిఫెస్టో విడుదలకు బీజేపీ ముహూర్తం నిర్ణయించింది. ఏప్రిల్ 14న అంటే రేపు ఆదివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇతర ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఈ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. 2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు అవసరమైన ప్రణాళికలు ప్రకటించడంతోపాటు, మోదీ గ్యారంటీలు, రైతులు, యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించడంతోపాటు, రైతులు, రైతు కూలీల సంక్షేమానికి మ్యానిఫెస్టోలో భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.