UN experts condemn Pak for atrocities on minority women
పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గాలపై, ప్రత్యేకించి
మైనారిటీ మహిళలపై అత్యాచారాలు నేటికీ కొనసాగుతుండడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర
అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్‌లోని హిందూ, క్రైస్తవ మహిళలను బలవంతంగా మతం
మార్చడం, బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ, జెనీవా
నుంచి విడుదల చేసిన ప్రకటనలో, తీవ్రంగా ఖండించింది.
‘‘పాకిస్తాన్‌లో క్రైస్తవ, హిందూ మహిళల పరిస్థితి
ఆందోళనకరంగా ఉంది. వారిని బలవంతంగా మతం మారుస్తున్నారు, ఎత్తుకుపోతున్నారు. అక్రమ
రవాణా చేస్తున్నారు. చిన్నపిల్లలను సైతం బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. గృహనిర్బంధంలో
ఉంచి దాస్యం చేయిస్తున్నారు, లైంగిక దోపిడీలకు పాల్పడుతున్నారు’’ అని ఆ ప్రకటనలో
యుఎన్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేసారు.
ఐక్యరాజ్యసమితి మాననవ హక్కుల సంస్థ హైకమిషనర్
పేరిట విడుదలైన ఆ ప్రకటన ఇంకా ఇలా చెబుతోంది… ‘‘మతపరంగా మైనారిటీలు అయిన వర్గాలకు
చెందిన ఆడపిల్లలు, యువతుల పట్ల అమానుషమైన హింసాకాండ జరుగుతోంది. అలాంటి నేరాలకు
కనీసం శిక్ష కూడా లేదు. అలాంటి పరిస్థితిని సహించడం, సమర్థించడం ఇంకెంతమాత్రం
సాధ్యం కాదు. పోలీసులు ఈ నేరాలను ప్రేమ పెళ్ళిళ్ళ పేరిట కొట్టిపడేస్తున్నారు. దాంతో
నేరస్తులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా తప్పించుకుపోతున్నారు.’’
ఏ బాలికకైనా చిన్నవయసులో పెళ్ళి లేదా బలవంతపు
వివాహాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సమర్ధించే పరిస్థితి లేదని నిపుణుల కమిటీ నివేదిక
స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం బాధితురాలు మైనర్ అయితే పెళ్ళికి
ఒప్పుకున్నా అలాంటి ఒప్పుకోలు అసంబద్ధమైనదే అవుతుంది.
‘‘జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు, ఆ వ్యక్తితో
వైవాహిక జీవితంలోకి ప్రవేశించే హక్కు మహిళ జీవితంలో అత్యంత ప్రధానమైనవి. ఆమె
హుందాతనం, సమానత్వం పరిరక్షించబడాలన్నదే న్యాయశాస్త్రాల నిర్ణయం’’ అని ఐరాస
నిపుణులు వెల్లడించారు.
‘‘మహిళలు, బాలికల సంక్షేమానికి ప్రాధాన్యం
ఇవ్వాలి. వారిని బెదిరించి లేదా భయపెట్టి చేసుకునే పెళ్ళిళ్ళు చెల్లకుండా చేసే,
రద్దయిపోయేలా చేసే చర్యలు తీసుకోవాలి. బాధితురాళ్ళకు న్యాయం జరగాలి, వారికి భద్రత
సమకూర్చాలి, తగిన సహాయం అందజేయాలి’’ అని ఐరాస నిపుణులు తెలియజేసారు. పాకిస్తాన్‌లో
జరుగుతున్న బలవంతపు పెళ్ళిళ్ళు, బలవంతపు మతమార్పిడుల కేసుల్లో మైనారిటీ మతాలకు
చెందిన మహిళలే బాధితులుగా ఉంటున్నారని వారు స్పష్టంగా వెల్లడించారు.
‘‘వ్యక్తుల పూర్తి
ఇష్టంతోనే వారి పెళ్ళిళ్ళు జరిగేలా పాకిస్తాన్ అధికారులు కఠినమైన చట్టాలు చేయాలి,
వాటిని కచ్చితంగా అమలు చేయాలి. పెళ్ళికి కనీస వయసు 18ఏళ్ళకు పెంచాలి. క్రైస్తవ,
హిందూ మతాలకు చెందిన మహిళలు సహా ఏ మహిళ లేదా బాలిక పట్ల వివక్ష ఉండకూడదు. వారి
మతవిశ్వాసాలను కించపరచకూడదు. అటువంటి నేరాలకు పాల్పడినవారిపై కఠినాతికఠినమైన
చర్యలు చట్టబద్ధంగా తీసుకోవాలి. తద్వారా చిన్నపిల్లల బలవంతపు పెళ్ళిళ్ళను
నివారించాలి, మైనారిటీ మతాల ఆడపిల్లలను ఎత్తుకుపోవడం, అక్రమ రవాణా చేయడం వంటి
చర్యలను నిలువరించాలి. అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణలో పాకిస్తాన్ తమ పాత్రకు
న్యాయం చేయాలి’’ అని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం తమ నివేదిక ద్వారా పాకిస్తాన్‌ను
హెచ్చరించింది.