Jallianwala Bagh Massacre
Anniversary
13 ఏప్రిల్
1919 భారతదేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం. ఆరోజు అమృతసర్ నగరంలోని జలియన్‌వాలాబాగ్‌లో
జరిగిన సామూహిక జనహనన మారణకాండ చరిత్ర పుటల్లో ఏనాటికీ మానని గాయంగా మిగిలిపోయింది.
ఆ దురదృష్టకరమైన రోజు వేలాది సిక్కులు బైసాఖి (వైశాఖి) పండుగ జరుపుకోడానికి ఆ
తోటలో సమావేశమయ్యారు. వారిలో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు అన్న
తేడా లేకుండా అందరూ ఉన్నారు. పండుగ సంబరాల్లో ఉన్న భారతీయులను బ్రిటిష్ ప్రభుత్వం అకారణంగా
నిర్దాక్షిణ్యంగా బలితీసుకుంది. బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాలతో
ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా తెల్లసైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.
ఆనాటి దుర్ఘటనలో వెయ్యిమందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది
గాయపడ్డారు.
నరమేధానికి
నేపథ్యం
1919
నాటికి భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనపై ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. దాన్ని
మొగ్గలో తుంచేయాలన్న తెల్లవారి దురాలోచన ప్రతిఫలమే జలియన్‌వాలాబాగ్ నరమేధం. 1919లో
భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టం చేసింది. ఆ దుర్మార్గమైన చట్టం
ప్రకారం, భారతదేశపు వ్యక్తులు ఎవరినైనా బ్రిటిష్ ప్రభుత్వం ఏ విచారణా లేకుండా అరెస్ట్
చేయవచ్చు, శిక్షించవచ్చు. ఆ చట్టం మీద దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. పంజాబ్‌లో నిరసనలు మరింత తీవ్రంగా ఉన్నాయి. జాతీయవాద
భావజాలం కలిగిన నాయకులు సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ వంటివారి అరెస్టులతో
సాధారణ పంజాబీ పౌరుల్లో సైతం ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణమది.
ఏప్రిల్ 13నాటి విషాద ఘటనల క్రమం
జలియన్‌వాలాబాగ్ అనేది అమృతసర్ నగరంలోని ఒక ఉద్యానవనం.
మూడువైపులా ఎత్తయిన గోడలతో ఆవరించబడిఉన్న తోట అది. 1919లో ఏప్రిల్ 13న బైసాఖి
పర్వదినం వచ్చింది. అది సిక్కులకు పెద్ద పండుగ. ఆ పర్వదినం జరుపుకోడానికి
వేలాదిమంది జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమయ్యారు. అలాగే, జాతీయ నాయకుల అరెస్టులను నిరసిస్తూ,
వారికి సంఘీభావం ప్రకటించడానికి కూడా వారు సిద్ధమయ్యారు. పెద్దసంఖ్యలో ప్రజలు
ఒకచోట చేరుతున్నారన్న సమాచారం బ్రిగేడియర్ జనరల్ డయ్యర్‌కు తెలిసింది. ఆ
జనసమూహాన్ని చంపేయాలని డయ్యర్ నిర్ణయించుకున్నాడు. తోటకు ఉన్న అన్ని దారులూ మూసివేసి
లోపల ఉన్నవారిపై కాల్పులు జరపాలని తన బలగాలను ఆదేశించాడు. పది నిమిషాల పాటు
నిర్విరామంగా కాల్పులు కొనసాగాయి.
ప్రజాస్పందన
జలియన్‌వాలాబాగ్ నరమేధం దేశవ్యాప్తంగానే కాదు,
ప్రపంచమంతటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్రిటిష్ పాలకుల దురహంకార దమనకాండకు
నిరసనలు వెల్లువెత్తాయి. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి జలియన్‌వాలాబాగ్ రణన్నినాదమైంది.
స్వపరిపాలన ఆవశ్యకతను భారతీయులందరికీ అర్ధమయ్యేలా చెప్పింది. బ్రిటిష్ వలస పాలకుల
దుష్ట దుర్మార్గ పరిపాలనను ప్రపంచానికి కళ్ళకు కట్టింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ
జలియన్‌వాలాబాగ్ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
ఆ నరసంహారం నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆ సంఘటన
గురించి విచారణ జరపడానికి హంటర్ కమిషన్‌ను నియమించింది. అయితే ఆ కమిషన్ నివేదిక
జరిగిన సంఘటన తీవ్రతను చాలావరకూ తగ్గించి చూపించింది. మరణాల సంఖ్యను గణనీయంగా
తగ్గించివేసింది. జనరల్ డయ్యర్ తప్పేమీ లేదన్నట్లుగా నివేదిక రూపొందింది. ఆ నివేదిక
ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్‌ను అతికొద్దికాలం సస్పెండ్ చేసింది. అయితే
కొద్దికాలానికే ఆ సస్పెన్షన్‌ను తొలగించి
అతన్ని మళ్ళీ విధుల్లో చేర్చుకుంది. అంతేకాదు, తెల్లదొరతనం డయ్యర్‌ను అవార్డులు
ప్రదానం చేసింది, సన్మానాలూ చేసింది.
సామూహిక జనహనన మారణకాండ అసలు జరగనేలేదన్నట్టు
చెప్పడానికి తెల్లదొరతనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత చరిత్రపై ఆ సంఘటన చూపిన
ప్రభావం కొట్టిపారేయలేనిది. బ్రిటిష్ వలస పాలకుల అణచివేత ధోరణిని కళ్ళకు
కట్టినట్టు చూపించిన భయానక నరమేధం అది. స్వాతంత్ర్యం కోసం పోరాటంలో భారతీయులు
చేసిన త్యాగాలకు నిదర్శనం అది. మానవహక్కులను, ప్రజాస్వామిక విలువలనూ
పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను చాటిచెప్పిన సందర్భమది.