Modi meets top gamers to forge path
సమాజంలోని విభిన్న వర్గాలను ఆకట్టుకోడంలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీది ప్రత్యేకమైన కళ. దేశ ప్రజలు ఎన్నోయేళ్ళుగా చూస్తూనే
ఉన్న బురదజల్లుడు కార్యక్రమాలకే ప్రతిపక్షాల నాయకులు పరిమితమైపోయిన వేళ ప్రధాని
మోదీ దేశంలోని వివిధ వర్గాల ప్రజలను తనవైపు తిప్పుకోడంలో అనూహ్యమైన పద్ధతులను
ప్రవేశపెడుతుంటారు. ఆ క్రమంలోనే మోదీ గురువారం నాడు గేమింగ్ ఇండస్ట్రీకి చెందిన
ప్రముఖులతో భేటీ అయ్యారు.
అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పాటన్కర్, పాయల్ ధార్,
నమన్ మాథుర్, అన్షు బిష్త్ వంటి టాప్ గేమర్స్ మనదేశంలో గేమింగ్ రంగంలో
అగ్రగణ్యులు. వారంతా నవయువతరానికి ప్రాతినిధ్యం వహించే వారే కావడం విశేషం.
అలాంటివారితో మోదీ సమావేశమయ్యారు.
ఆ సమావేశంలో ప్రధానమంత్రి వారితో మన దేశంలో
గేమింగ్ రంగానికి సంబంధించిన పలు కోణాలను చర్చించారు. భారతీయ పురాణ ఇతిహాసాల
ఆధారంగా గేమ్స్ తయారుచేయడం, గేమింగ్‌ను చట్టబద్ధమైన కెరీర్‌గా ఎంచుకోవడం, గేమింగ్
పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చ సాగింది. గేమర్స్ భారతదేశంలో ఎదుర్కొనే
సవాళ్ళ గురించి ప్రధాని మోదీ వారిని అడిగి తెలుసుకున్నారు. నైపుణ్య ఆధారిత గేమ్స్,
లాభాలే లక్ష్యంగా నిర్వహించే జూద క్రీడల మధ్య తేడాల గురించి చర్చించారు. వీడియో
గేమ్స్‌కు యువతరం అడిక్ట్ అయిపోవడం వల్ల సమాజం మీద పడే దుష్ప్రభావాల గురించి కూడా
చర్చ సాగింది.
గేమర్స్‌తో సంభాషించడానికి మాత్రమే మోదీ పరిమితం
కాలేదు. వర్చువల్ రియాలిటీ గేమ్స్, పీసీ అండ్ కన్సోల్ గేమింగ్, మొబైల్ గేమ్స్ ఆడడంలో
తన అభిరుచిని చూపించారు. గేమింగ్ రంగంలోని చిక్కుల గురించి, ఆ రంగంలో
ఎదుగుదలకు-అభివృద్ధికీ ఉన్నఅవకాశాల గురించి మాట్లాడి, ఆ రంగాన్ని అభివృద్ధి
చేయడానికి తన నిబద్ధతను చాటారు.
కొన్నివారాల క్రితం నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్
పేరిట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను సత్కరించిన ప్రధాని మోదీ, ఇప్పుడు
గేమర్స్‌తో భేటీ అవడం విశేషం. అలా డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ సహా సమాజంలోని
వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఆకట్టుకోడంలో మోదీ ముందంజలో ఉన్నారు. గేమింగ్
రంగంలో అభివృద్ధి-ఉపాధి అవకాశాల గురించి ఆ రంగ నిపుణులతో చర్చించడం, వారిని
ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం ఆ రంగంలో భారత్‌ను అంతర్జాతీయ స్థాయి హబ్‌గా
తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉందన్న సంకేతాలు వెళ్ళాయి.
గేమింగ్ ఇండస్ట్రీ ఇంకా
పరిణామదశలో ఉంది, దాని విస్తరణకు చాలా అవకాశాలున్నాయి. ఈ సమయంలో గేమింగ్ రంగ
అభివృద్ధిలో ఆ రంగంలోని సంస్థలు, కంటెంట్ క్రియేటర్స్ కీలక పాత్ర పోషిస్తారు.
వారితో స్వయంగా ప్రధానమంత్రే సానుకూల దృక్పథంతో చర్చలు జరపడం ఆ రంగంలో భారత్
భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందన్న సంకేతాలు పంపించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు