Jitender Reddy, the biography of ABVP leader from Jagityal
తెలంగాణలో 80వ దశకంలో నక్సలైట్ల
అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రత్యేకించి విద్యాసంస్థలను తమ విద్యార్ధి సంఘాలతో
నింపివేసి కలుషితం చేసిన నక్సలైట్లు తమకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా
హత్యలు చేసేవారు. అలాంటి నక్సలైట్లకు కొన్నేళ్ళపాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన వీరుడు
ముదుగంటి జితేందర్ రెడ్డి. అతని జీవితగాధ ఆధారంగా వస్తున్న చిత్రం ‘జితేందర్
రెడ్డి’.
మహాభారత యుద్ధంలో, అర్జునుడి కుమారుడైన
అభిమన్యుణ్ణి ఒక్కొక్కరుగా ఎదుర్కోలేని కౌరవులు, ఆ పిల్లవాణ్ణి ఏకాకిని చేసి అందరూ
కలిసి మూకుమ్మడిగా హతమార్చారు. అలాగే, ఎబివిపి నేత అయిన జితేందర్ రెడ్డిని నేరుగా ఎదుర్కోలేని
నక్సలైట్లు గుంపుగా చుట్టుముట్టి కాల్చిచంపారు. 1987 ఏప్రిల్ 9న దాదాపు ముప్ఫైమంది
నక్సలైట్లు చుట్టుముట్టి ఒంటరిగా ఉన్న జితేందర్ రెడ్డిని దారుణంగా హతమార్చారు.
సామాజిక వ్యవస్థల పట్ల నమ్మకం లేని నక్సలైట్లు
ప్రజలను ఏమార్చో హతమార్చో భయపెట్టో బెదిరించో తమ దారికి తెచ్చుకునే క్రమంలో ఎన్నో
అరాచకాలకు పాల్పడ్డారు. సహజంగా ఉద్రేకం ఎక్కువగా ఉండే యవ్వనదశలోని విద్యార్ధులను
ఆకట్టుకుని అంతులేనన్ని అకృత్యాలు చేసారు. అలాంటివారికి ఎదురొడ్డి, జాతీయవాద
దృక్పథాన్ని విద్యార్థుల్లో ప్రచారం చేయడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
చేసిన కృషి, ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న కష్టనష్టాలూ ఎన్నెన్నో. తెలంగాణ వ్యాప్తంగా
కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో తమను ప్రతిఘటించిన విద్యార్ధి పరిషత్ నాయకులను,
కార్యకర్తలను ఎందరినో నక్సలైట్లు హతమార్చారు.
తెలంగాణలోని జగిత్యాల ప్రాంతంలో 80వ
దశకంలో నక్సలైట్లకు ఎదురుతిరిగి, వారిని మూడుచెరువుల నీళ్ళు తాగించిన వ్యక్తి
జితేందర్ రెడ్డి. విద్యార్ధి దశ నుంచే వారికి పక్కలో బల్లెంగా మారాడు. తర్వాత
ఎబివిపి నాయకుడిగా నక్సలైట్లను, వామపక్ష విద్యార్ధి సంఘాల ముసుగులోని సంఘవిద్రోహశక్తులనూ
నానాతిప్పలూ పెట్టాడు. వారికి సింహస్వప్నంగా నిలిచాడు. నక్సలైట్లను దేశభక్తులుగా
వర్ణించిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుకు నక్సలైట్లు దేశభక్తులు కాదు,
దేశద్రోహులు అని నేరుగా చెప్పిన ధైర్యవంతుడు జితేందర్ రెడ్డి.
ఇప్పటికీ తెలంగాణ ప్రాంత ఎబివిపి కార్యకర్తలు,
నేతలు ప్రేమగా ‘జిత్తన్న’ అని పిలుచుకునే జితేందర్ రెడ్డి జీవితకథ వెండితెర మీద
ఆవిష్కృతం అవుతోంది. జితేందర్ సోదరుడు ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ
సినిమాకు విరించివర్మ దర్శకత్వం వహించారు. గోపిసుందర్ సంగీతం అందించగా జ్ఞానశేఖర్
డిఒపిగా వ్యవహరించారు.
ఈ జీవితగాధాచిత్రంలో యువనటుడు రాకేష్
వర్రే కథానాయకుడిగా నటించారు. గతంలో బాహుబలి, మిర్చి వంటి చిత్రాల్లో కీలకపాత్రలు
పోషించి ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో అయిన రాకేష్, ఈ చిత్రంలో తన ప్రతిభను
చాటారన్న సంగతి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ చూస్తే అర్ధమవుతుంది. జితేందర్ రెడ్డి సమకాలికులు, ఎబివిపి కార్యకర్తలు ఎందరినో కలిసి ఆయన
వ్యక్తిత్వాన్ని వాస్తవికంగా చూపేందుకు శ్రమించానని రాకేష్ చెబుతున్నారు.
ఇప్పటికే దేశ చరిత్ర అంతా దొంగలు,
దోపిడీదారులు చెప్పిన కథలతో నిండిపోయి ఉంది. దాన్ని ప్రక్షాళన చేసి అసలైన చరిత్రను
బైటపెట్టాల్సిన సమయమిది. సామ్యవాదం ముసుగులో నక్సలైట్లు పాల్పడిన అరాచకాలను,
జాతీయవాద స్ఫూర్తిని ప్రజలకు చేరువ కానీయకుండా అడ్డుపడిన కుతంత్రాలను, దేశభక్తి
కలిగిన జితేందర్ రెడ్డి వంటి యువకుల త్యాగాలనూ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం
ఎంతయినా ఉంది. మే 3న విడుదల కానున్న ‘‘జితేందర్ రెడ్డి – HI’S’TORY NEEDS TO BE TOLD’’ సినిమా, చరిత్రలో మరుగున పడిన కోణాలను వెలికితీస్తుంది.