Fifteen Maoists
Surrender in Jharkhand
నిషిద్ధ సిపిఐ మావోయిస్టు పార్టీకి పెద్ద
ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో ఆ సంస్థకు చెందిన 15మంది కార్యకర్తలు పోలీసులకు
లొంగిపోయారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…
లొంగిపోయిన మావోయిస్టులు మిసిర్ బెస్రా గ్యాంగ్ సభ్యులు. బెస్రా జార్ఖండ్‌లో
సీనియర్ మావోయిస్టు నాయకుడు. అతని తలపై కోటి రూపాయల నజరానా ఉంది. లొంగిపోయిన
వారిలో ఇద్దరు మహిళలు, ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు
పశ్చిమ సింగ్భమ్ జిల్లాలోని కొల్హన్ అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న కోర్ మావోయిస్ట్
జోన్‌కు చెందిన వారు.
జార్ఖండ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందం
సమక్షంలో ఆ పదిహేను మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిని సాధారణ జనజీవన
స్రవంతిలోకి పోలీసులు ఆహ్వానించారు. వారికి పునరావాస పథకాల కింద లభించే లబ్ధిని
అందజేస్తారు.
లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఇంతమంది
మావోయిస్టుల లొంగుబాటు ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమ సింగ్భమ్ లోక్‌సభ
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు జరగకుండా
మావోయిస్టులు అడ్డుకుంటున్నారు. ఆ ప్రాంతంలోని కొన్నిప్రాంతాల్లో ఇప్పటికీ సిపిఐ మావోయిస్టుల ఈస్టర్న్ రీజినల్
బ్యూరో ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ఆ పరిస్థితిని మార్చాలని స్థానిక పోలీసులు,
సిఆర్పిఎఫ్ జవాన్లు పట్టుదలగా ఉన్నారు.
మరోవైపు, ఉగ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్
ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ)ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలను, జాతీయ
దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, పసిగట్టింది. పిఎల్‌ఎఫ్‌ఐ అనేది సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి
విడిపోయి కొందరు మావోయిస్టులు పెట్టుకున్న సొంత కుంపటి. ఆ సంస్థను మళ్ళీ
క్రియాశీలం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.
వినోద్ ముండా అలియాస్ సుఖ్వా, జార్ఖండ్‌లోని
ఖుంటి జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న పిఎల్‌ఎఫ్‌ఐ కార్యకర్త. అతన్ని ఎన్ఐఏ ఏజెంట్లు
బుధవారం అరెస్ట్ చేసారు. జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఏజెంట్ల వేటలో ఆ
జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల్లో మావోయిస్టు ప్రచారం చేస్తూ దొరికారు. వారివద్ద
వాకీటాకీ, మొబైల్ ఫోన్లు, కొంత నగదు, పిఎల్‌ఎఫ్‌ఐ సంస్థకు చెందిన కొన్ని
డాక్యుమెంట్లు లభించాయి.