కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బిఐ, ఆ వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించలేమని వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించడం అనేది వ్యక్తిగత వివరాల కిందకు వస్తుంది కాబట్టి ఇవ్వలేమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది.లోకేశ్ బాత్రా అనే కార్యకర్త ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సమాచారం ఇవ్వడం నమ్మకస్తుని హోదా కిందకు వస్తుందని, ఇవ్వలేమని ఎస్‌బిఐ స్పష్టం చేసింది.
సమాచార హక్కు చట్టంలో మినహాయింపు ఉన్న సెక్షన్ కిందకు వస్తుంది కాబట్టి వ్యక్తిగత సమాచారం ఇవ్వలేమని కూడా ఎస్‌బిఐ వివరణ ఇచ్చింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన సమాచారం ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించడం విచిత్రంగా ఉందని లోకేశ్ బాత్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టకుండా కోర్టులో వాదించేందుకు సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వేను నియమించుకున్న ఎస్‌బిఐ, ముందు ఆ న్యాయవాదికి ఎంత చెల్లించిందో చెప్పాలని బాత్రా డిమాండ్ చేశారు.