ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తీరును
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి తప్పుబట్టారు. ఉగ్రవాదులతో కలిసి భారత్‌ను
అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని
హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడం పాకిస్తాన్ కు చేతకాకపోతే భారత్ సహకారం తీసుకోవాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియా ఛానల్ కు
ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ కాలాన్ని
గుర్తుచేసుకుంటూ కాంగ్రెస్‌పై
విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టైన తనను, తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా
అనుమతించలేదన్నారు. బీజేపీ నేతలను నియంతలంటూ కాంగ్రెస్ విమర్శించడాన్ని ఆయన
ఖండించారు.
భారత్ లో శాంతిభద్రతలకు విఘాతం
కలిగించేందుకు ఏ ఉగ్రవాది ప్రయత్నించినా కఠిన చర్యలుంటాయన్నారు. ఒక వేళ ఉగ్రవాదులు
పాకిస్తాన్ కు పారిపోయినా అక్కడకి వెళ్ళి
హతమారుస్తామని హెచ్చరించారు.
పాకిస్తాన్ లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల
వెనుక న్యూదిల్లీ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై రాజ్ నాథ్ స్పందించారు. భారత్
ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదని పేర్కొన్న రాజ్ నాథ్ సింగ్, ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించేందుకు యత్నించదన్నారు.