సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. సిక్కిం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధ్యక్షుడు నడ్డా మ్యానిఫెస్టో విడుదల చేశారు. మోదీ కీ గ్యారంటీ, వికసిత్ భారత్ వికసిత్ సిక్కిం పేరుతో రూపొందించిన మ్యానిఫెస్టోను నడ్డా సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో విడుదల చేశారు. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని, బీజేపీ గడచిన పదేళ్లలో అభివృద్ధి చేసి చూపించిందన్నారు. ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప, అభివృద్ధి పట్టలేదని నడ్డా విమర్శించారు. మోదీ నాయకత్వంలో భారత్ దూసుకెళుతోందన్నారు. లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్, యాక్ట్ ఫస్ట్ అంటూ మోదీ దేశంలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారని నడ్డా కొనియాడారు.
కేంద్ర సహకారంతో సిక్కింలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థను ప్రపంచ స్థాయి విద్యాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ద్వారా యువతకు నైపుణ్యం పెంచి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నడ్డా వెల్లడించారు.సిక్కింలో యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు, పర్యాటకాన్ని పరుగులు తీయిస్తామని హామీ ఇచ్చారు.