కాశీ విశ్వనాథుడి ఆలయంలో భద్రతా విధులు
నిర్వహించే, పోలీసు సిబ్బంది ఇక నుంచి సంప్రదాయ వస్త్రధారణలోనే విధులు
నిర్వహించనున్నారు. ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీలు ధరించనున్నారు.
ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత
మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పురుషులు ధోతీ, షాల్ ధరించనుండగా మహిళా
పోలీసులు సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నారు.
భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా
నడుచుకోవాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణాశిబిరం నిర్వహించనున్నారు.
రద్దీ నియంత్రణలో ‘నో టచ్’ విధానాన్ని అమలు
చేయాలని నిర్ణయించారు. భక్తులను నేరుగా తాకకుండా తాళ్లతో క్యూలైన్లను
నియంత్రిస్తారని కమిషనర్ ఆఫ్ పోలీస్ మోహిత్ అగర్వాల్ తెలిపారు.
భక్తులను ఎట్టి పరిస్థితుల్లో చేతులతో తోస్తూ నియంత్రించేందుకు
ప్రయత్నించకూడదని అధికారులు తెలిపారు.
రద్దీ సమయాల్లో క్యూలైన్ల లోని భక్తులతో
భద్రతా సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆలయ పాలక మండలి ఈ
నిర్ణయం తీసుకుంది.