Netizens Question Intention of Judges in Patanjali Ad
Case
బాబా రాందేవ్‌కు
చెందిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ, దాని ఎండీ ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన రెండో
క్షమాపణ అఫిడవిట్‌ను సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది. పతంజలి సంస్థ మందుల
ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ దాఖలైన కేసులో ఆ సంస్థ బాధ్యుల క్షమాపణలను
కోర్టు పదేపదే నిరాకరిస్తుండడంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జస్టిస్ అసనుద్దీన్
అమానుల్లా, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మానసం పతంజలి సంస్థ తాజాగా దాఖలు చేసిన
బేషరతు క్షమాపణను నిరాకరించింది. గతేడాది నవంబర్‌లో కోర్టుకు ఇచ్చిన మాటను
ధిక్కరించి ప్రకటనలు ఇచ్చారంటూ పతంజలి సంస్థపై ఆరోపణలు వచ్చాయి. సంస్థ సహ
వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌ను కూడా ధర్మాసనం
తిరస్కరించింది.
పతంజలి సంస్థకు ప్రాతినిధ్యం
వహిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీకి జడ్జిలు, కాగితం మీద రాసిచ్చిన
లిఖితపూర్వక క్షమాపణ సరిపోదని చెప్పారు. వాళ్ళు రాసిచ్చిన క్షమాపణ పత్రాన్ని తాము
ఒప్పుకోదలచుకోలేదని జస్టిస్ హిమా కోహ్లి వెల్లడించారు. తీవ్రమైన చర్యలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కేసులో తాము ఎంతమాత్రం ఉదారంగా
ఉండదలచుకోలేదని, తప్పు చేసిన వారు బాధపడాల్సిందేననీ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, పతంజలి
ఆయుర్వేద్ సంస్థపై చర్యలు తీసుకోలేదంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా ఈ
వివాదంలోకి సుప్రీంకోర్టు లాక్కొచ్చింది. ‘ఈ కేసులో అధికారులు వ్యవహరించిన తీరుపై
మాకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. మేం మిమ్మల్ని వదిలిపెట్టం. చీల్చి చెండాడుతాం’ అని
జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా మండిపడ్డారు. కేసు విచారణలో వారం రోజులు గడువు
ఇవ్వాలని రోహత్గీ కోరితే, దానికీ అసనుద్దీన్ నిరాకరించారు. ‘ఇది కేవలం ఉత్పత్తుల
గురించి కాదు, చట్టాన్ని ధిక్కరించడం గురించిన కేసు’ అంటూ సుద్దులు చెప్పారు. ఈ
కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులు బహిరంగ క్షమాపణ చెప్పడానికి సైతం సిద్ధంగా ఉన్నారని
చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
అసలు వివాదం ఏమిటి?
పతంజలి సంస్థ, తాము
తయారు చేసే కొన్ని ఔషధాలు అల్లోపతిక్ మందులు కూడా తగ్గించలేని కొన్ని వ్యాధులను
నయం చేస్తాయని, కొన్ని ప్రకటనలు విడుదల చేసింది. ఆ ప్రకటనలకు వ్యతిరేకంగా ఇండియన్
మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. గత నవంబర్‌లో, సుప్రీంకోర్టు
ఉత్తర్వులకు అనుగుణంగా, ఇకపై అటువంటి ప్రకటనలు ఇవ్వబోమని పతంజలి సంస్థ హామీ
ఇచ్చింది. అయితే అలాంటి ప్రకటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ సుప్రీంకోర్టు ఈ
యేడాది ఫిబ్రవరి 27న పతంజలి సంస్థకు, దాని ఎండికి ధిక్కార నోటీసులు జారీ చేసింది. అసలు
పతంజలి సంస్థ తమ ఉత్పత్తులు ఏయే వ్యాధులకు మందులు అన్న విషయాన్ని వెల్లడించకూడదంటూ
ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కంటెంప్ట్ నోటీసుకు
జవాబివ్వలేదని భావించిన సుప్రీంకోర్టు పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణను, సహ
వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని మార్చి నెలలో
ఆదేశించింది.
ఈలోగా పతంజలి ఎండి
అఫిడవిట్ దాఖలు చేసారు. తమ ప్రకటనల్లో సాధారణ వివరాలు మాత్రమే ఉండాలని, అయితే అజాగ్రత్త వల్ల కొన్ని వాక్యాలు చేర్చబడ్డాయనీ వివరించారు. అంతేకాక,
ఆ ప్రకటనలు సదుద్దేశంతో జారీ చేసినవి మాత్రమేనని స్పష్టం చేసారు. నవంబర్‌లో కోర్టు
జారీ చేసిన ఉత్తర్వుల గురించి తమ సంస్థ ఉద్యోగులకు తెలియకపోవడం వల్ల పొరపాటు
జరిగిందని ఒప్పుకున్నారు.
అంతేకాక, కోర్టు
ప్రస్తావించిన డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ రూపొందించిన సమయానికి ఆయుర్వేద ఔషధాల
గురించి శాస్త్రీయ ఆధారాలు లేనందున ఆయుర్వేద వైద్యం గురించి ఆ చట్టంలో సరైన వివరాలు
లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఇంక విచారణ ఆఖరి రోజున బాబా రాందేవ్, బాలకృష్ణ
ఇద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. బాలకృష్ణ సమర్పించిన అఫిడవిట్‌పై కోర్టు
అసంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టు తీరుపై నెటిజెన్ల స్పందన
ఈ కేసు వ్యవహారంలో
సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు పక్షపాత ధోరణితో, అన్యాయంగా ఉందని నెటిజెన్లు
అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియా
కార్యకర్త సిన్హా ఇలా రాసారు ‘‘తప్పుదోవ పట్టించే ప్రకటన విషయంలో బాబా రాందేవ్
క్షమాపణ చెప్పినా దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మీరు పరిణామాలు
ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. అంతేలే. అతనొక మౌలానా లేక మిషనరీ అయి ఉంటే,
పవిత్రజలంతో రోగాలు నయం చేసేస్తామని చెప్పుకుని ఉంటే ఎవరూ పట్టించుకుని ఉండేవారు
కాదు. రాందేవ్ చేసిన అతిపెద్ద తప్పు అతని పేరు ముందు బాబా అని పెట్టుకోవడమే. ఇది
కేవలం తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయం మాత్రమే అయుంటే, దాదాపు అన్ని ఉత్పత్తులూ
అదేపని చేస్తున్నాయి, వాటిపై ఎలాంటి కేసులూ లేవు.’’
రచయిత, సామాజికవేత్త
రశ్మీ సావంత్ ఇలా రాసారు. ‘‘హార్లిక్స్, రస్నా, డోవ్ ఇలా ఏ ఉత్పత్తి ప్రకటన అయినా
తీసుకోండి, అన్నీ తప్పుదోవ పట్టించే ప్రకటనలే. కానీ ఘనత వహించిన న్యాయమూర్తులు
మాత్రం ఒక భారతీయ బ్రాండ్‌ను చీల్చి చెండాడి తీరతామని హెచ్చరిస్తారు. మన సమాజంలో
బలంగా పాతుకుపోయిన, వ్యవస్థీకృతమైపోయిన వలసపాలన విధానాలే ఇవి.’’
‘హిందూపోస్ట్’ మీడియా సంస్థ తమ సోషల్ మీడియాలో
ఇలా రాసుకొచ్చింది. ‘‘ఒక సన్యాసిని జైలుపాలు చేస్తే తప్ప ఆ చామనచాయ దొరల రాజ్యాంగ
నైతికత తృప్తి చెందదు. అసలు కాషాయ దుస్తులు ధరించి, ఆయుర్వేదాన్నీ యోగానీ ప్రచారం
చేసే, ఆత్మవిశ్వాసం కలిగిన, హిందీలో మాత్రమే మాట్లాడే సాధువుకు…
విచ్ఛిన్నమైపోయిన మన న్యాయవ్యవస్థలో సర్వసాధారణంగా పాటించే చట్టపరమైన విధానాలను
అనుసరించడానికి ఎంత ధైర్యం? కొరడా మొదటిసారి ఝళిపించినప్పుడే కాళ్ళమీద పడిపోకుండా,
ఇప్పుడు క్షమాపణ చెబితే సరిపోతుంది అనుకోడానికి ఎంత ధైర్యం? ఆలస్యం చేసే, అల్లరి
చేసే, వ్యవస్థలను పక్కదోవ పట్టించే అధికారం కొంతమందికి మాత్రమే పరిమితం కదా. సిబల్, ధావన్, భూషణ్, శీతల్వాద్ లాంటి ఇంగ్లీషు
మాట్లాడే చామనచాయ దొరలు, పెద్దపెద్ద టెక్నాలజీ సంస్థలు, టాటా బిర్లా లాంటి
కార్పొరేట్ సంస్థల అధిపతులకు మాత్రమే అలాంటి అధికారం ఉంటుంది. కానీ ఈ దేశపు భాష
మాట్లాడే ఇక్కడి స్థానికులు ఎదిగిపోవడమే… అలాంటి వాళ్ళకు పాఠం నేర్పించాల్సిందే.
దురదృష్టం. రాజ్యాంగబద్ధమైన ఈ అధికారాన్ని, శక్తినీ…. సామూహిక జనహననానికి
పాల్పడే మమతా బెనర్జీ లాంటి నేరస్తుల మీద ప్రయోగించి ఉంటే ఎన్నో జీవితాలు, ఎన్నో
కుటుంబాలూ రక్షించబడేవి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
రచయిత నీరజ్ అత్రీ ఇలా రాసారు ‘‘గౌరవ
సుప్రీంకోర్టు బెంచిలో జడ్జిగారి పేరు అసనుద్దీన్ అమానుల్లా. ఆయన సభ్యుడిగా ఉన్న
ధర్మాసనం బాబా రాందేవ్‌ను హెచ్చరిస్తుంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో
రాందేవ్ కఠినమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తుంది. ఆ పిటిషన్ దాఖలు
చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దాని అధ్యక్షుడు క్రైస్తవ మతాన్ని ప్రచారం
చేస్తుంటాడు. ఆశ్చర్యమేముంది?’’
పాత్రికేయుడు అనుపమ్
‘ఎక్స్’ మాధ్యమంలో ఇలా రాసుకొచ్చాడు, ‘‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ వాడి ఒక నల్లటి
వ్యక్తి తెల్లగా మారగలడా? మామూలు వ్యక్తి హృతిక్ రోషన్‌లా మారిపోగలడా? మజిల్
బ్లేజ్ టాబ్లెట్లు వాడేవారికి కండరాలు పెరిగిపోతాయా? బాబా రాందేవ్, పతంజలి మాత్రమే
ప్రకటనలు ఇస్తున్నారా? ఇంకెవ్వరూ ప్రకటనలు ఇవ్వడం లేదా? కోల్గేట్ కూడా ఇప్పుడు తమ
ఉత్పత్తిని హెర్బల్ అని ఎందుకు చెప్పుకుంటోందా? అల్లోపతిక్ కంపెనీలు దగ్గుమందులో
తులసి ఎందుకు వాడుతున్నాయి? యోగా, ఆయుర్వేదం తప్పుదోవ పట్టించేవే అయితే, మరి ఎవరు
గ్యారంటీ ఇవ్వగలరు?’’ అంటూ ప్రశ్నలు సంధించాడు.