Ram Temple locked by Maoists 21 years ago, unlocked now
రామాయణంలో రాముడికి వనవాసం 14ఏళ్ళే. ఆ సమయంలో
కూడా ఆయన స్వేచ్ఛగా వనవిహారం చేసాడు. కానీ కలియుగంలో మావోయిస్టులు 21ఏళ్ళపాటు
రాముణ్ణి చెర పట్టారు. రామమందిరానికి తాళం వేసేసారు. ఇన్నాళ్ళకు ఆయనకు విముక్తి
లభించింది.
రాముడి జన్మభూమి అయోధ్యలో ముష్కరులు కూల్చేసిన
ఆయన గుడిని మళ్ళీ కట్టుకోడానికి 5వందల యేళ్ళు పట్టింది. అలాగే మావోయిస్టుల
ప్రాబల్య రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో రాముడి గుడిని తెరుచుకోడానికి 21ఏళ్ళు పట్టింది.
ఇప్పుడు కూడా, ఆ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ దళాలు ఒక క్యాంపు ఏర్పాటు చేసుకున్నందున
గుడి తెరుచుకుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లాపేండా
గ్రామంలో రామాలయం ఉంది. అయితే దాన్ని 2003లో మావోయిస్టుల బెదిరింపులకు భయపడి
మూసివేసారు. ఇవాళ్టి వరకూ ఆ గుడిని తెరిచే సాహసం ఎవరూ చేయలేకపోయారు.
ఆ గ్రామంలోని రామాలయాన్ని 1970లో బిహారీ మహరాజ్
అనే వ్యక్తి నిర్మించాడు. గుడి కట్టే సమయానికి ఆ ప్రాంతంలో కనీస రహదారి సౌకర్యమైనా
లేదు. అయినా గ్రామస్తులు రామయ్య మీద భక్తితో 80 కిలోమీటర్లకు పైగా దూరం నడుచుకుంటూ
వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి గుడి నిర్మాణం పూర్తి చేసారు.
గుడి కట్టిన తర్వాత గ్రామస్తుల్లో ధార్మిక నిష్ఠ
జాగృతమైంది. చాలామంది గ్రామీణులు స్వచ్ఛందంగా మాంసాహారం, మద్యపానం మానేసారు.
హింసాత్మక కార్యక్రమాలకు దూరం జరిగారు. ధార్మికమైన జీవితం గడపడం ప్రారంభించారు. క్రమంగా
ఆ గుడి దగ్గర జాతర కూడా మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వేలాది భక్తులు
రామయ్యను దర్శించుకోడానికి వచ్చేవారు. అయోధ్య నుంచి కూడా సాధుసంతులు అక్కడికి
వస్తుండేవారు.
అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని మావోయిస్టులు
సర్వనాశనం చేసేసారు.
2003 సమయంలో మావోయిస్టులు ఆ గ్రామంలో పాగా
వేసారు. అయితే అక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుండడంతో వారి రహస్య కార్యకలాపాలు
నిర్వహించడం కుదరలేదు. దాంతో వారు అక్కడ రామాలయంలో పూజలు చేయడాన్ని నిషేధించారు.
ఏటా నిర్వహించే జాతర కూడా ఆపించేసారు.
చివరికి గుడికి తాళం కూడా వేసేసారు. కనీసం దర్శనం చేసుకునే అవకాశమైనా లేకుండా
చేసేసారు.
అలా రెండు దశాబ్దాల పాటు రామయ్యను మావోయిస్టులు
బందీని చేసేసారు. ఆలయంలో కనీసం దీపం, ధూపం, నైవేద్యం పెట్టే అవకాశం లేకుండా
చేసారు. చివరికి ఆ పరిస్థితి 2023లో మారింది.
2023 మార్చి 14న సీఆర్‌పీఎఫ్ 74వ బెటాలియన్, లఖాపాల్-కేర్లాపేండా
గ్రామాల సమీపంలో క్యాంప్ ఏర్పాటు చేసుకుంది. వాళ్ళు ఆ అమాయక గ్రామస్తుల మనసులను
గెలుచుకునే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో, అక్కడ పాడుబడి ఉన్న రామాలయాన్ని గుర్తించారు.
ఆ గుడి చరిత్ర స్థానిక గ్రామస్తులనుంచి తెలుసుకున్నారు. దాన్ని పునరుద్ధరించే
కార్యక్రమం చేపట్టారు.
ముందుగా స్థానిక అధికారులు, జవాన్లు గ్రామస్తులతో
కలిసి ఆ ప్రాంతంలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయం పరిసరాలను శుభ్రం
చేసారు.
‘‘ఇక్కడ సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ క్యాంపు ఏర్పాటు
చేయడంతో గ్రామీణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. వాళ్ళు గుడిని పునరుద్ధరించాలంటూ మమ్మల్ని
కోరారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని మేం ముందుగా ఆ ప్రాంతాన్ని శుభ్రం
చేసాం. గుడిని బాగుచేసాం. దాంతో గ్రామస్తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఒక మంచిరోజు
చూసుకుని గుడిని వారికి అప్పగించాం. ముందు ఒకపూట దీపం పెట్టడం మొదలుపెట్టారు.
క్రమంగా అన్నిరకాల పూజలూ మొదలయ్యాయి. కొన్నాళ్ళు గడిచేసరికి సాయంత్రం పూట కూడా
మహిళలు, పిల్లలు వచ్చి భజనలు, పూజాకార్యక్రమాలు చేయడం ప్రారంభమైంది. మొత్తం మీద
గ్రామంలో సానుకూల వాతావరణం నెలకొంది. ఇక అక్కడ అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడమే
మా పని’’ అని బెటాలియన్ కమాండెంట్ హిమాన్షు పాండే చెప్పారు.
ఎట్టకేలకు రామయ్యకు
21ఏళ్ళ మావోయిస్టుల చెర వీడిందని గ్రామస్తులు ఆనందిస్తున్నారు.