MVA seat sharing finalized in Maharashtra
దేశమంతా మాదే అనేలా ఇండీ కూటమి అని పేరు పెట్టుకున్న
ప్రతిపక్ష కూటమి ఆవిర్భవించిన నాటినుంచీ నానా అవస్థలూ పడుతోంది. ప్రస్తుతం
ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా సీట్ల సర్దుబాటు చేసుకునే తలనొప్పులు పడుతోంది. ఎట్టకేలకు
మహారాష్ట్రలో కూటమి పొత్తులు కుదిరాయి. అక్కడ మహా వికాస్ అఘాడీ పేరుతో ఉన్న ఇండీ
కూటమి పార్టీలు ఇవాళ్టికి సీట్ల సర్దుబాటు చేసుకోగలిగాయి.
మహారాష్ట్రలో 48లోక్సభ స్థానాలున్నాయి. వాటిలో
శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం 21 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 17 స్థానాల్లో
రంగంలోకి దిగనుంది. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మిగిలిన 10 సీట్లలో పోటీ చేస్తుంది.
ముంబై మహానగరంలోని 8 నియోజకవర్గాల్లో ఆరింట శివసేన
(యుబిటి) పార్టీయే బరిలోకి దిగుతుంది. కాంగ్రెస్ మిగతా రెండు సీట్లలో పోటీ
పడుతుంది.
కూటమిలోని మూడు పార్టీల మధ్యా పీటముడి పడిన సీట్లు
భివాండి, సాంగ్లి. ఒకదశలో కూటమి విచ్ఛిన్నమై పోయినా పర్వాలేదు, ఆ సీట్లు మాకే
కావాలంటూ మూడు పార్టీలూ పోటీపడ్డాయి. ఆ విషయంలో ఎట్టకేలకు రాజీ కుదిరింది. భివాండి
స్థానం ఎన్సిపి (శరద్ పవార్) పార్టీకి, సాంగ్లి సీటు శివసేన (యుబిటి) పార్టీకీ కేటాయించారు.
గత రెండు ఎన్నికల్లో ఆ సీట్లను బీజేపీ నేతలు గెలుచుకున్నారు.
మరో ఆసక్తికరమైన స్థానం బారామతి. అక్కడ శరద్
పవార్ పార్టీ తరఫున ఆయన కూతురు సుప్రియా సూలే బరిలోకి దిగుతున్నారు. అక్కడ ఆమె
ప్రత్యర్థి వేరెవరో కాదు, ఆమెకు వరుసకు సోదరి అవుతుంది. శరద్ పవార్ మేనల్లుడు,
ఎన్సీపీని చీల్చి పెద్ద ముక్కను ఎన్డీయేలో చేర్చిన అజిత్ పవార్ భార్య సునేత్రా
పవార్ అక్కడ పోటీ పడుతోంది. దాంతో బారామతిలో పోరు కుటుంబంలోనే ఉండబోతోంది.
ఈ కూటమిలో ప్రకాష్ అంబేడ్కర్ పార్టీ వంచిత్
బహుజన్ అఘాడీ (విబిఎ)కు చోటు దక్కలేదు. ఆ పార్టీ 8 సీట్లు అడిగింది. కనీసం 5సీట్లయినా
కేటాయించాలని అభ్యర్ధించింది. కానీ కూటమి మిత్రత్రయం ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
దాంతో ప్రకాష్ అంబేడ్కర్, కూటమి పక్షాలు తమ వారసత్వ రాజకీయాలకు ప్రచారం చేసుకోడానికి
తమ పార్టీని వాడుకునే ప్రయత్నం చేసాయని ఆరోపించారు.