Judicial Custody of Kalvakuntla Kavita extended till 23 April
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీ
లాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు విధించిన జ్యుడీషియల్
కస్టడీ ఏప్రిల్ 23 వరకూ పొడిగించబడింది. ఆ మేరకు రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ
చేసింది.
ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి కవిత ప్రయత్నించారనీ,
సాక్ష్యాలను ధ్వంసం చేసారనీ, అందువల్ల ఆమె జ్యుడీషియల్ కస్టడీని మరో రెండువారాలు
పొడిగించాలనీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టకు విన్నవించుకుంది. ఈడీ విజ్ఞప్తిని
ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా అనుమతించారు.
కవిత తరఫున వాదించిన నితేష్ రాణా ఈడీ విజ్ఞప్తిని
ఖండించారు. కవితను అరెస్ట్ చేసాక కొత్తగా చోటు చేసుకున్న పరిణామాలు ఏమీ లేవని,
అందువల్ల కస్టడీ అడగడానికి కొత్త ప్రాతిపదికలేమీ లేవనీ చెప్పారు. మరోవైపు కవిత
వ్యక్తిగతంగా కోర్టుముందు తన కష్టాలు చెప్పుకుంటానన్న అభ్యర్ధనను కోర్టు
తిరస్కరించింది. ఆమె రాతపూర్వకంగా తమకు విన్నవించుకోవచ్చునని సూచించింది.
ఈడీ తరఫున జోహెబ్ హుసేన్, నవీన్ కుమార్ మట్టా,
సైమన్ బెంజమిన్ వాదించారు. కవిత తరఫున నితేష్ రాణా, దీపక్ రాణా, మోహిత్ రావు
వాదనలు వినిపించారు.