Doctorji Hedgewar Birth Anniversary Today
ప్రస్తుత తెలంగాణ ప్రాంతం ఇందూరు జిల్లా గోదావరి,
మంజీర, హరిద్ర నదుల సంగమస్థానం కందకుర్తి గ్రామం. శతాబ్దాలకు పూర్వం వేద అధ్యయనము,
శాస్త్ర అధ్యయనమూ వృత్తిగా గలిగిన నరహరి శాస్త్రి కుటుంబం నైజాం
పాలనలో ఎదుర్కొంటున్న కష్టాల నుండి బైటపడడానికి ఆ గ్రామం నుండి నాగపూర్
వెళ్ళిపోయింది. ఆ వంశంలోని బలిరాం పంత్ కుమారుడే హిందూ సమాజ సంఘటన కోసం జీవితాన్ని
సమర్పించుకున్న కేశవరావు.
డాక్టర్జీగా ప్రఖ్యాతి గడించి కేశవరావు బలీరాం
హెడ్గేవార్ 1889 ఏప్రిల్ 1, ఉగాది పండుగ రోజున జన్మించారు. ఈ
క్రోధి నామ సంవత్సర ఉగాదికి వారు జన్మించి 135 సంవత్సరాలు అవుతున్నది. 135 ఏళ్ళ
క్రితం జన్మించిన డాక్టర్జీ హిందూ సమాజ పునర్నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆచరణలు ఈ
రోజుకి ఆచరణీయం.
డాక్టర్జీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించటానికి
ముందు దేశంలో చోటు చేసుకొన్న పరిస్థితులు, ఆంగ్లేయులు చేస్తున్న దుష్ప్రచారాలు,
దేశ ప్రజల ఆలోచనలలో మార్పులు ఇట్లా అనేక విషయాలను విశేషంగా అధ్యయనం చేసారు. దాని
ఫలస్వరూపము 1925 సంవత్సరం సంఘ ప్రారంభం. అట్లా సమాజ హితం అనే
గీటురాయి మీద పనిచేసిన డాక్టర్జీ విశిష్టత తెలుసుకోవాలంటే స్వాతంత్ర పూర్వరంగాన్ని
అర్ధం చేసుకోవాలి.
డాక్టర్జీ జన్మించిన నాటికి దేశ సమకాలీన
పరిస్థితులు
1857 స్వాతంత్ర సంగ్రామం తర్వాత ఆంగ్లేయులూ, భారతీయ
మేధావులూ ఆలోచనలో పడ్డారు. ఆంగ్లేయులు 1857 నాటి పరిస్థితులు తిరిగి రాకుండా తమ
పాలనను కొనసాగించేందుకు ఏమి చేయాలి అని ఆలోచించి, ఆలోచించి
రెండు అభూత కల్పనలను ఈ దేశం మీదకి వదిలారు. (1) భారత్ ఒక దేశం కాదు , ఒక
జాతి కాదు, ఇది ఒక ఉపఖండము. (2) ఆ సిద్ధాంతానికి బలం చేకూర్చడం కోసం ఆర్య ద్రావిడ
సిద్ధాంతం సృష్టించారు. ఆ సిద్ధాంతం మూలసూత్రం ‘‘ఈ దేశం ఎవ్వరిదీ కాదు, అందరూ బైట నుండి
వచ్చిన వారే. ఈ దేశం మీద మొదట ఆర్యులు దండయాత్ర చేసారు, ఆ తరువాత దాడుల పరంపర కొనసాగింది.అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు
బైట నుంచి వచ్చినవారే’’ అని సూత్రీకరించారు.
దాని ప్రభావం ఈ దేశంలోని మేధావులపై పడటం
ప్రారంభమైంది.దాని పర్యవసానం ఈ దేశానికి ఎవరెవరు ఏ
కారణాల వల్ల వచ్చారో వారందరు ఇక్కడి జాతీయులే నని విశ్వసిస్తూ ఉండేవారు. దాని
ప్రభావం ఈ దేశపు స్వతంత్ర పోరాటం మీద పడింది. అయినా ఆ సమయంలో దేశం లో వ్యక్తులు, సమూహాలు,సంస్థల రూపంలో అనేక రంగాలలో పనులు మొదలైనాయి. ఆ
ప్రయత్నాలలో భాగంగా అనేక సంస్థలు పుట్టు కొచ్చాయి. వాటిలో ఆర్యసమాజ్, కాంగ్రెస్,
రామకృష్ణ మిషన్, ముస్లింలీగ్, హిందూమహాసభ, కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమైనవి.
సంఘ ప్రారంభము
డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించడానికి ముందు
దేశంలోని పరిస్థితులు, ఆ సమయంలో జాతీయ స్థాయిలో పని చేస్తున్న ధార్మిక, సామాజిక,
రాజకీయ సంస్థల కార్యకలాపాలన్నింటినీ చాలా దగ్గరగా పరిశీలించారు. ఆ అనుభవాలతో
డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు. 1920 నుండి బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని పరిమితులతో
ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. దానితో దేశంలో వివిధ ప్రాంతాలలో రాజకీయ పార్టీలు
ప్రారంభమైనాయి కానీ దేశానికి సంబంధించిన ఒక క్రొత్త సామాజిక సంస్థ కూడా ప్రారంభం కాలేదు.
స్వాతంత్రం వచ్చాక కూడా పుట్టగొడుగుల్లా రాజకీయ పార్టీలు ప్రారంభమైనాయి. ఆధ్యాత్మిక
రంగంలో అనేక మంది స్వామీజీలు,మాతాజీలు
వివిధ సంస్థలను ప్రారంభించి దేశంలో, ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచేందుకు
ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్జీలా సమాజానికి సంబంధించిన అన్ని విషయాలనూ సమగ్రంగా ఆలోచించి పని
చేయగల శక్తివంతమైన వ్యవస్థ ప్రారంభమే కాలేదు. అదే డాక్టర్ జి గొప్పతనం. డాక్టర్జీ కి
స్ఫూర్తినిచ్చిన గ్రంథాలు రెండు… (1) తిలక్ గీతారహస్యం. అది నిష్కామ కర్మకు ప్రతీక.
(2) సమర్థ రామదాస స్వామి దాసబోధ. సమాజ సంఘటనకు పని ఎట్లా చేయాలి
కార్యకర్తలకు ఎటువంటి గుణగణాలు ఉండాలి మొదలైన విషయాలు దానిలో ఉన్నాయి. సమర్థ
రామదాస స్వామి తన జీవన సర్వస్వాన్ని స్వధర్మాన్ని రక్షించడానికి పనిచేశారు. అట్లా
డాక్టర్జీ తిలక్, సమర్ధ రామదాసస్వామి స్ఫూర్తిగా సంఘ కార్యాన్ని వికసింప చేసారు.
సంఘ పని స్పష్టతకు – డాక్టర్జీ మాటలు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పని స్పష్టత కోసం
డాక్టర్జీ నాలుగు విషయాలను ప్రధానంగా చెప్పారు.
(1) ఇది హిందూ రాష్ట్రం (2) మనం
హిందువులం (3) హిందూ సమాజ సంఘటన నిర్మాణం చేయాలి, దానికి
వ్యక్తి నిర్మాణం ప్రధానం (4) హిందూ సమాజ సంఘటనతో ఈ దేశాన్ని పరమ వైభవ
స్థితికి తీసుకొని వెళ్ళాలి. అందుకే సంఘంలో శాఖ పద్ధతి ప్రారంభించారు.
(1) శాఖ నిర్వహణకు సంబంధించిన ఆచార విభాగం, ఆజ్ఞలు,
ప్రార్థన, ప్రతిజ్ఞ అన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశాన్ని కలిపి ఉంచే
ఏకైక భాష సంస్కృతం. ఆవిషయాన్ని చెప్పకనే డాక్టర్జీ మనకు అర్ధం చేయించారు.
(2) ఈ దేశానికి జాతీయ ధ్వజం భగవా ధ్వజం. ఆ
విషయాన్ని గుర్తింపచేయడానికే సంఘానికి గురువు భగవా ధ్వజం అని ప్రకటించారు. ప్రతీ రోజూ
శాఖలో దేశమంతా కొన్నివేల ప్రదేశాలలో ఈ భగవా ధ్వజాన్ని ఎగురవేసి దానిముందు ప్రార్థన
చేయడం మనకు కనపడుతూ ఉంటుంది. 1938లో సంఘ శిక్షావర్గ పూర్తయిన తర్వాత ‘‘భగవా జెండా’’
పేరుతో తీసిన చలనచిత్రాన్ని ఆవిష్కరించడానికి ఆహ్వానం మేరకు డాక్టర్జీ పూనా వెళ్లా
రు. ఆ చిత్ర నిర్మాత దాదాసాహెబ్ తోరక్ డాక్టర్జీని స్వాగతిస్తూ ‘‘300
సంవత్సరాలకు పూర్వము సమర్ధ రామదాస స్వామి ఏ మంత్రా న్ని మహారాష్ట్రలో ఉపదేశించారో
అదే మంత్రాన్ని డాక్టర్జీ ఈ రోజున దేశమంతా ఉపదేశిస్తున్నారు. భగవాధ్వజాన్ని జాతీయ ధ్వజంగా
పునఃప్రతిష్ఠించడానికి కృషి చేస్తున్నారు అని అన్నారు. ఆ సందర్భంగా డాక్టర్జీ
ప్రసంగిస్తూ మన ప్రాచీన చరిత్రను తరచి చూస్తే ఈ దేశానికి భగవాధ్వజం ఏకైక ధ్వజం అని
రుజువు అవుతుంది. నేటివరకూ హిందూ దేశంలో ఎన్ని జాతీయ ఉద్యమాలు జరిగాయో ఆ
ఉద్యమకారులందరూ ఈ భగవా ధ్వజ ఛాయల్లోనే పనిచేసారు. శంకరాచార్యులు, విద్యారణ్యులు
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు మనకు కనబడతాయి. అట్లా భగవాధ్వజానికి జాతీయ ధ్వజంగా
గుర్తింపు తెచ్చారు.
(3) ఈ దేశం హిందువుల దేశం. ఇది హిందూ రాష్ట్రం. ఈ
దేశపు పరమ వైభవ స్థితి కోసం మనందరం పనిచేయాలి అని చెప్పారు. డాక్టర్జీ ప్రారంభించిన
శాఖల ద్వారా దేశ మంతా ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది. ఈ రోజున ఆ వ్యవస్థ దేశంలో ఒక
శక్తివంతమైన వ్యవస్థ. అదీ డాక్టర్జీ దార్శనికత. డాక్టర్జీ ఈ లోకాన్ని విడిచే
నాటికి దేశంలో 700 శాఖలు ఒక లక్ష మంది స్వయంసేవకులు తయారైనారు.
ఇది హిందూరాష్ట్రం – ఒక వాదాతీత సత్యం
అసలు ఈ దేశం ఎవరిది? ఏ ఆలోచనలు ప్రపంచానికి
శాంతిని అందించాయి? వేల సంవత్సరాల ఘన చరిత్ర ఎవరికి ఉన్నది? అటువంటి చరిత్ర ఈ దేశానికే
ఉన్నది. అటువంటి ఈ దేశాన్ని ఒక దేశం కాదని బ్రిటిష్ వాడు తన అవసరార్థం సిద్ధాంతీకరించి
ప్రచారం చేస్తే ఆంగ్ల విద్యను అభ్యసించిన మన వాళ్ళు ఆంగ్లేయుల ప్రచారాన్ని నెత్తికెక్కించుకొని
ఈ దేశం ఒక దేశం కాదు,ఒక
జాతి కాదు అని బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువగా మాట్లాడడం ప్రారంభించారు. అది ఒక
ఫ్యాషన్‌గా కూడా మారిపోయింది. దానిని కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయిలో భుజానికి
ఎత్తుకొని ప్రచారం చేసారు. కాబట్టే రాజ్యాంగంలో ఈ దేశానికి ఏమి పేరు పెట్టాలని చర్చ
తలెత్తింది. ఆ చర్చలలో ఈ దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. దానిపైన పెద్ద చర్చ
జరిగిన కారణంగా మన అదృష్టం బాగుండి INDIA THAT IS BHARAT అని
పేరు మార్చారు. ఈ స్థితి ఎందుకు వచ్చింది, అసలు వాస్తవం ఏంటి గమనించవలసిన అవసరం
ఉంది. అటువంటి విషయాలపై డాక్టర్ హెడ్గేవర్‌జీ ఆ కాలంలోనే స్వయంగా చెప్పిన మాటలలో
చూద్దాం. డాక్టర్జీ ఇది హిందూ రాష్ట్రం అని, ఇది వాదాలకు అతీతమైన ఒక సత్యం అని
ప్రకటించారు.డాక్టర్జీకి ప్రేరణ ఈ దేశభక్తి అవటం వల్ల విదేశీయులైన
ఆంగ్లేయులను నిరోధించడమే ఏకైక కార్యము అనే దృక్పథం వారికి రాలేదు.భక్తితో పూజించే ఈ దేశం స్వరూపము ఏమిటి అనే మౌలిక విషయాలను లోతుగా
అధ్యయనం చేసారు. హిందూ జీవనము
త్రికాలాబాధిత సత్యంగా వారికి సంపూర్ణంగా సాక్షాత్కరించింది.
సమకాలీన సమయంలో ప్రచారంలో ఉన్న అనైతిహాసికతమరియు
అసత్యమైన కలగూరగంప జాతీయవాదము బుద్ధికీ తర్కానికీ అందనిది. విశుద్ధ జాతీయ భావనకు విరుద్ధ మైనది.జాతీయ సమాజాన్ని దాని శత్రువుల నుండి, విదేశీ
ఆక్రమణదారుల నుండి, స్వదేశాన్ని సమాజాన్ని జీవన వైశిష్ట్యాన్ని రక్షించుకోవడానికి
ప్రా ణాలొడ్డి పోరాడే వారిని గుర్తించడంలో పొరపాటు జరిగింది, ఈ
భ్రమలతో పనిచేస్తున్నంత కాలం మన దేశం మహా అనర్థాల పరంపర ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి
సదా దీనిని శ్రేష్ఠ స్థితిలో ఉంచుతాము అని ప్రకటించారు.
ఇది హిందూ రాష్ట్రము అనేది ఒక వాదాతీతమైన సత్యం
అని ఈ రోజున దేశమంతా గుర్తించడం మనకు కనపడుతోంది. సుప్రీంకోర్ట్ అనేక సందర్భాల్లో
హిందుత్వం అంటే ఒక జీవన విధానం అని తన తీర్పుల్లో పేర్కొనటం కూడా మనం గమనించవచ్చు.
ఈ మధ్య హర్యానా దగ్గరలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అఖిల భారత ప్రతినిధి సభ జరిగింది
ఆ సభ అనంతరం సంఘ సర్ కార్యవాహ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక మాట చెప్పారు. ఇది
హిందూ రాష్ట్రం అనేది సాంస్కృతిక పరమైనది, ఇది హిందూ రాష్ట్రం అని చెప్పేందుకు
రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదని చెప్పారు ఇది హిందూ రాష్ట్రంగానే ప్రపంచమంతా
గుర్తిస్తున్నది అని కూడా చెప్పారు.
వివిధ సిద్ధాంతాల అలజడి
ముస్లిముల దండయాత్రలతో ఈ దేశంలో ఇస్లాం
ప్రవేశించింది. ఒకప్రక్క ఈ దేశ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొంటూనే మరోప్రక్క
పెద్దఎత్తున మతమార్పిడులు చేస్తూ దేశాన్నిఇస్లామీకరణ చెయ్యటం ప్రారంభించింది. బ్రిటిష్
వారి ప్రవేశంతో ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 1920లో ప్రారంభమైన
కమ్యూనిజం నుండి నక్సలిజం పుట్టు కొచ్చింది. మరోప్రక్క బ్రిటిష్ వారు సృష్టించిన
ఆర్య ద్రావిడ సిద్ధాంతం,భారత్
ఒక ఉపఖండము అనే సిద్ధాంతాల ప్రభావాలకు లోనైన ఉదారవాద మేధావివర్గం క్రొత్తగా పుట్టుకొచ్చి
దేశ సమగ్రతకు సవాళ్ళు విసురుతున్నారు ఈ సవాళ్ళను అధిగమించేందుకు దూరదృష్టితో
డాక్టర్జీ ఇది హిందూరాష్ట్రమని ఆ రోజులలోనే నిర్ద్వంద్వంగా ప్రకటించి, హిందూ సమాజ సంఘటనకు తెర తీసారు. ఆ
పనిలో డాక్టర్జీ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
సంఘ స్వయంసేవకులలో అనుశాసనం, దేశభక్తి సమాజంలోని
అందరినీ ఆకట్టుకుంటోంది. అది కాంగ్రెస్ నాయకులకు నచ్చకపోయేది. మరో ప్రక్క హిందూ
మహాసభ వారు ఈ స్వయం సేవకులు మాకు అన్ని రకాలుగా ఉపయోగపడటం లేదు అనే అసంతృప్తి ఉండేది.
డాక్టర్జీ కి రెండు ప్రక్కల వాయింపు ఉండేది. కాంగ్రెస్ అసహనం, హిందూ మహాసభ అసంతృప్తి…
ఈ రెండింటి మధ్య సంఘాన్ని నిలబెట్టడంలో డాక్టర్జీ సఫలీకృతమయ్యారు. కాంగ్రెసు వారు
మరియు స్వాతంత్ర్యానంతరం పుట్టుకొచ్చిన రాజకీయ సంస్థలు అన్నీ రాష్ట్రీయ స్వయంసేవక
సంఘాన్ని తమ ప్రత్యర్థిగానే భావిస్తున్నారు. సంఘము ఒక సామాజిక జాతీయ సంస్థగా దేశ హితం
కోసం పనిచేస్తున్నది అని భావించటం లేదు. సంఘ ప్రగతిని జీర్ణించుకోలేక పోతున్నారు.
రాజకీయాలు విసిరే సవాళ్ళకు పరిష్కార ము హిందూ సమాజ సంఘటనలోనే ఉన్నదనే డాక్టర్జీ విశ్లేషణ
అక్షర సత్యము.
డాక్టర్జీ హిందూ సమాజ సంఘటనకు రెండు విశేషాలు జోడించారు.
(1) సంఘ కార్యం ఈశ్వరీయ కార్యం (2)సంఘ
కార్యం జాతీయ కార్యము. ఈ రెండు మాటలతో సమాజ సంఘటన గురించి డాక్టర్జీ కల్పన మనకు
అర్థమవుతుంది. సంఘకార్యం ద్వారా సమాజ హితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్నచిన్న
గ్రామాల నుండి దేశమంతటా తయారు కావాలి అనేది వారి లక్ష్యం. తద్వారా దేశమంతటా దేశ
హితం గురించి ఆలోచించే వ్యవస్థ నిర్మాణం కావాలి. అదే ఈ దేశానికి శ్రీరామరక్ష. ఈరోజున
దేశమంతటా వారి ఆలోచనల సాకారం కనబడుతోంది. మనందరం ఒకే జాతి అనే భావం నిర్మాణం మనకు
కనబడుతోంది, అటువంటి ఆలోచనలు మనకు కలిగించిన డాక్టర్జీ ఒక యుగ
ద్రష్ట.
ఈరోజు దేశమంతటా మనం ఒకటే అనే భావానికి తాజా
ఉదాహరణ అయోధ్యలో రామజన్మభూమిలో రామమందిర పునర్నిర్మాణానికి ప్రజల నుండి వచ్చిన స్పందనను
చూస్తే అర్థమవుతుంది. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం వేగంగా పెరుగుతున్నది. దానిని మరింత వేగంగా ముందుకు
తీసుకుని వెళ్ళేందుకు ప్రయత్నం చేద్దాం.
ఈ వితర్కాల కుట్రలు ఎలా చోటు చేసుకొన్నాయి?
అసలు ఇటువంటి ప్రశ్నలు మన సమాజంలో ఎందుకు తలెత్తుతున్నాయి
అనేది తెలుసుకోవాలంటే మనం చరిత్రను ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. బ్రిటిష్
ప్రభుత్వం నిర్వహించిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత బ్రిటిష్ ప్రధాని వాగ్దో
నాల్డ్ ఒక ప్రకటన చేశారు ”అన్ని వర్గాలకు తృప్తినిచ్చే ఏదైనా ఒక ప్రణాళికను మీరు సూచించకపోతే ప్రభుత్వమే ఆ పని
చేయవలసి వస్తుంది. ప్రజాస్వామ్యం పేరిట అధిక సంఖ్యాకులు పశుబలంతో అల్పసంఖ్యాకులను అణచకుండా
అవసరమైన అంకుశాలను సృష్టించవలసి వస్తుంది అని ప్రకటించాడు. 1932
ఆగస్టు 17న బ్రిటిష్ ప్రధాని తాను అనుకున్నట్లు కమ్యూనల్ అవార్డు
ప్రకటించాడు. దాని ప్రకారం ఈ దేశ ప్రజలను (1) హిందువులు
(2) ముస్లింలు (3) సిక్కులు (4) దళితులు
(5) భారతీయ క్రైస్తవులు (6) యూరోపియన్‌లు అంటూ విభజించి వారికి
రిజర్వేషన్లు ప్రత్యేకించి కేటాయించారు. అది దేశ విభజనకు సంకేతంగా మారిపోయింది. దానిని
కాంగ్రెస్ గాని నెహ్రూ గాని ప్రతిఘటించలేదు. దాని భవిష్యత్తు పరిణామాలు ఎట్లా
ఉంటాయి అని కూడా ఆలోచించలేదు. కానీ డాక్టర్ జీ ఆ అవార్డు చూసిన తర్వాత దానిని
తీవ్రంగా వ్యతిరేకించారు.ఆ
అవార్డు రానున్న ఆపదలకు గుర్తుగా వారు గుర్తించారు. దాని పరిణామం ఆ తదుపరి కాలంలో
దేశవిభజనలో మనం చూసాం.
రాజకీయాలకు అలిప్తంగా డాక్టర్జీ
డాక్టర్జీ కాంగ్రెస్‌లో, హిందూమహాసభలో పనిచేస్తూ వాటినుండి
బైటకు వచ్చి సంఘాన్ని ప్రారంభించారు. అట్లా అని డాక్టర్జీ రాజకీయాలను ఉపేక్షించలేదు.
అట్లాగే రాజకీయాలే సర్వస్వం అని కూడా అనలేదు. రాజకీయాల కంటే సామాజిక శక్తి అవసరం
గుర్తించారు. అవసరమైతే రాజకీయాలను నియంత్రించగలిగే సామాజిక శక్తి ఉండాలని భావించారు.
అందుకే సంఘాన్ని ప్రారంభించారు.
స్వాతంత్ర పోరాటానికి ఒక వేదికగా ప్రారంభమైన
కాంగ్రెస్ క్రమంగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతూ వచ్చింది.రాజకీయాలతోనే
అన్నీ సాధించవచ్చు,అవే సర్వస్వం అని భావిస్తూ కాంగ్రెస్ నెహ్రూ
వ్యవహరించిన తీరు దేశానికి చాలా నష్టం కలిగించింది. డాక్టర్జీ ఆ విషయాన్ని
జాగ్రత్తగా పరిశీలించి రాజకీయాలకు అలిప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు.
హిందూ సమాజంలో ఒక సామాజిక, ధార్మిక శక్తిని నిర్మాణం చేయటానికి కృషి చేసారు. దేశ
ఉజ్వల భవిష్య్తతుకు ఈర్ష్యలతో నిండిఉండే రాజకీయాలు ఉపయుక్తం కావని, ఆ విషయంలో తగు
జాగ్రత్త తీసుకోని పక్షంలో అవి దేశానికి హానికరం కూడా కావచ్చు అని డాక్టర్జీ హెచ్చరిస్తూ
ఉండేవారు.
‘‘అర్ధాతురాణాం న గురు న బంధుః’’ కేవలం ధనకాంక్ష
కలవాడు గురువును బంధువులను కూడా లెక్కచేయడు.
‘‘కామాతురాణాం న భయం న లజ్జా’’ కామాతురుడైన
వాడికి భయము లజ్జ ఉండవు. అట్లాగే ఈ రోజున….
‘‘సత్తాతురాణాం న దళం, న
రాష్ట్రం’’ పదవీకాంక్ష గల రాజకీయ నాయకుడికి పార్టీ లెక్క ఉండదు, దేశం
కూడా లెక్కలో ఉండదు. తను అధికారం సాధించడమే అతని లక్ష్యంగా ఉంటుంది. ఇటువంటి
రాజకీయాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అందుకే దేశ భవిష్యత్తు నిర్మాణం
కొరకు అనుశాసనం సంఘటితమైన సామర్థ్యాన్ని సమాజంలో నిర్మాణం చేయాలని నిర్ణ యించారు.
అందుకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించారు. ఈ రోజు ఆ డాక్టర్జీ ఆలోచనలే
సరియైనవని నిరూపించబడుతోంది. అది డాక్టర్జీ దూరదృష్టి.
శత జయంతికి సిద్ధమౌతున్న సంఘం
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించి 2024 విజయదశమి
పండుగకు 99 సంవత్సరాలు పూర్తయి 100వ
సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నది. ఆ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను
నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది. అందులో
(1) సామాజిక సమరసత (2) కుటుంబ ప్రబోధనము (3) పర్యావరణం (4)స్వదేశీ భావన (5) పౌర విధులు…
ఈ పనుల ద్వారా సంఘం రాబోవు కొద్ది సంవత్సరాలలోనే సమాజంలో శక్తివంతమైన సామాజిక వ్యవస్థ
నిర్మాణం చేయాలని సంకల్పించింది.
99 సంవత్సరాలకు పూర్వం డాక్టర్జీ సమాజం ముందు ఉంచిన
సిద్ధాంతం ఈ రోజు దేశం,ప్రపంచం
అంతా అంగీకరిస్తోంది, అనుసరించడానికి సిద్ధపడుతున్నది.అది సిద్ధాంత విజయం.