ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల యుద్ధంతో గాజా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యుద్ధం మొదలై ఆరు నెలలు గడచిపోయింది. ఈ కాలంలో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. గాజాలో మానవతా సంక్షోభం నెలకొందని, దాన్ని అంగీకరించలేమని ఐరాస తెలిపింది. అక్కడ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలంటూ భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి భారత్ మద్దతు పలికింది. గాజాలో మానవతా సంక్షోభం ఇక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ తెలిపింది.
గాజాలో సంక్షోభం కొనసాగడం ఏ మాత్రం క్షేమంకాదని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అభిప్రాయపడ్డారు. మశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభ ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల మధ్య నెలకొన్న యుద్ధం వల్ల సామాన్యులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
గాజాలో పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని కూడా భారత్ ఐరాసను కోరింది. పాలస్తీనా ప్రజలకు సురక్షితమైన ప్రాంతం సూచిస్తూ తీసుకునే పరిష్కార మార్గానికి భారత్ కట్టుబడి ఉందంటూ తెలిపింది. ఆ దిశగా అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంది. గాజాలో ఐరాస కాల్పుల విరమణకు 14 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా ఓటింగ్‌లో పాల్గొనలేదు.