ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు
రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి దర్శనానికి
భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రి, తిరుమల, శ్రీశైలం సహా అన్ని ప్రధాన
క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దైవనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా ఉగాది
పండుగ చేసుకుంటారు. వ్యవసాయానికి సంబంధించి పంట కాలం కూడా నేటి నుంచి ప్రారంభం అవుతుంది.
ఉగాది తో సంతోషం, శాంతి, శ్రేయస్సు,
అదృష్టం లభిస్తాయని సనాతనులు
నమ్ముతారు. ఈ పండుగను తెలుగునేలపై ఎంతో వైభవంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
ఉగాది మహోత్సవాల్లో భాగంగా జ్యోతిర్లింగ
క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. కాసేపట్లో దేవస్థాన ఆస్థాన
సిద్ధాంతి పండి బుట్టే వీరభద్ర దైవజ్ఞచే పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. సాయంత్రం
ఆదిదంపతులకు రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో మూడో రోజు సోమవారం నాడు శ్రీభ్రమరాంబాదేవిని
మహా సరస్వతి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదిదంపతుల ఉత్సవ మూర్తులకు నిర్వహించిన ప్రభోత్సవం నేత్రానందభరితంగా సాగింది.
నందివాహన సేవను వీక్షించి భక్తులు తరించారు. స్వామిఅమ్మవార్ల నంది వాహనసేవను దర్శించిన
వారికి పనుల్లో విజయం లభించడంతో పాటు భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.