Rahul Gandhi reiterates of abolishing Agnipath scheme
నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈమధ్య
ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంకోసారి విమర్శలు
గుప్పించారు. కేవలం ఆరునెలలు శిక్షణ తీసుకున్న ‘అగ్నివీర్’లు ఐదేళ్ళు శిక్షణ
పొందిన చైనా సైనికులతో పోరాటంలో పాల్గొనలేరని రాహుల్ అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్లోని షాదోల్లో ఎన్నికల ప్రచార సభలో
రాహుల్ గాంధీ ప్రసంగించారు. నరేంద్ర మోదీ సర్కారు రూపొందించిన అగ్నివీర్ పథకాన్ని
భారత సైన్యం కోరుకోవడం లేదన్నారు. ‘‘గతంలో సైన్యంలో పేదవాళ్ళు పెద్దసంఖ్యలో చేరేవారు.
పెన్షన్, ఇతర హోదాలూ పొందేవారు. వారికి మిలటరీ క్యాంటీన్ సౌకర్యం కూడా ఉండేది.
కానీ, ఇప్పుడు అగ్నివీరులను తయారు చేస్తున్నామని,
వారికి ఆరు నెలల శిక్షణ ఇస్తున్నామని కేంద్రం చెబుతోంది. చైనా
సైనికులు మాత్రం ఐదేళ్ళ శిక్షణ పొందుతున్నారు. అందువల్ల ఒకవేళ ఇరుదేశాల మధ్యా
ఏదైనా ఘర్షణ తలెత్తితే ఫలితం ఎలా ఉంటుందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఆ జవాను
ఒకవేళ అమరుడైతే, తాను ‘అగ్నివీర్’ అయినందువల్ల అమరవీరుడి హోదా కూడా లభించదు’ అంటూ
రాహుల్ గాంధీ తీవ్రవ్యాఖ్యలు చేసారు.
రాబోయే లోక్సభ
ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చాక, అగ్నిపథ్ పథకాన్ని
రద్దు చేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎన్నికల
మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచామన్నారు. ఈ పథకంపై పీఎంఓ నిర్ణయం తీసుకుందని, దీనిపై ఆర్మీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.