NDA coalition to gather public opinion for public manifesto
ఎన్డీయే కూటమి త్వరలో విడుదల చేయనున్న
ప్రజా మ్యానిఫెస్టో కోసం ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం
తీసుకున్నారు. దానికోసం వాట్సాప్ నెంబర్‌ను (8341130393) విడుదల చేశారు.
మంగళగిరిఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్, మాజీ మంత్రి దేవినేని
ఉమామహేశ్వరరావు,మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు, టీడీపీ జాతీయ
అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్,
జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు లంకా దినకర్ పాల్గొన్నారు.
ఆ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్య
మాట్లాడుతూ రాక్షస పాలనను అంతం చేయడమే కూటమి లక్ష్యమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజా మద్దతు భారీగా
ఉందన్నారు. కూటమి మ్యానిఫెస్టో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. ప్రజల
అభిప్రాయాలకు ప్రాధాన్యతను బట్టి మ్యానిఫెస్టోలో చోటు కల్పిస్తామన్నారు. జనసేన
నాయకుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసమే కూటమి ఏర్పడిందని,
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి నేతలు పనిచేస్తున్నారనీ చెప్పారు. ప్రజా శ్రేయస్సుకోసమే
ప్రజా మ్యానిఫెస్టో రూపొందిస్తున్నామన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపి ప్రజా మ్యానిఫెస్టోలో
భాగస్వామ్యం కావాలని కోరారు.
బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్
మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ఫలితాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందించడమే కూటమి
లక్ష్యమన్నారు. వికసిత భారత్ సుసాధ్యమయ్యేది వికసిత ఆంధ్రప్రదేశ్‌తోనే అన్నారు.
దుర్యోధనుడు, నరకాసురుడి లాంటి జగన్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.