జ్యోతిర్లింగక్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో
ఉగాది ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా
నేడు భ్రమరాంబికదేవి అమ్మవారు శ్రీ మహాదుర్గ అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆదిదంపతులకు
నేడు కైలాస వాహనసేవ నిర్వహించున్నారు. శనివారం నాడు
యాగశాల ప్రవేశ క్రతువు నిర్వహించి, చతుర్వేదపారాయణ చేసి వేదస్వస్తి
నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు శ్రీభ్రమరాంబా
సమేత మల్లికార్జున స్వామి వార్లకు భృంగివాహనసేవ నిర్వహించారు.
మహాలక్ష్మీ
అలంకారంలో అమ్మవారిని భృంగివాహనదీశులైన స్వామిని భక్తులు దర్శించి తరించారు.
శ్రీశైల మహాక్షేత్రానికి తెలుగు రాష్ట్రాలతో
పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తుల
రద్దీ పెరగడంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు స్వామి, అమ్మవార్ల
దర్శనానికి అనుమతిస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు శీఘ్రదర్శనం కల్పిస్తున్నారు.
ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీగిరికి వచ్చే భక్తుల
కోసం అన్నపూర్ణాదేవి ఆశ్రమం, శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు అఖండ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
కన్నడ భక్తులకు విడిది సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.