Chandrababu Naidu assures his govt will pay pension of Rs 4000 from April itself
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల
పింఛను ఒకటో తేదీనే ఇళ్ల వద్ద అందిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లు ఇవ్వకపోతే ఈ నెల నుంచే రూ.4వేల
చొప్పున ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పెన్షన్లను జులై నెలలో చెల్లిస్తామని
చెప్పారు. జగన్ చేతకానితనం, దురుద్దేశం వల్లనే కొందరు పింఛనుదారులు
చనిపోయారని, అవి ప్రభుత్వ హత్యలేననీ మండిపడ్డారు. వారి
మరణాలకునైతిక బాధ్యతగా సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.
ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పక్కన పెట్టాలని
చెప్పిందే తప్ప పింఛన్లు పంపిణీ చేయవద్దని చెప్పలేదన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో 1.26
లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, ఇతర
ప్రభుత్వ సిబ్బంది ఉన్నారని… వారందరూ పెన్షన్లు పంపిణీ చేస్తే రెండ్రోజుల్లో పూర్తయేదన్నారు.
వాలంటీరు వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా కొనసాగిస్తామని
చెప్పారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని అర్ధమైన జగన్, రూ.13వేల
కోట్లు తమ గుత్తేదారులకు పంచిపెట్టారని ఆరోపించారు.
తెలుగుదేశం అధికారంలోకి వస్తే
తన మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేస్తానని చంద్రబాబు చెప్పారు. జగన్ మాత్రం
రాజీనామా చేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తారని చెబుతున్నారని దుయ్యబట్టారు. తాను
సీఎం అయ్యాక అన్నక్యాంటీన్లు మళ్ళీ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.