Case filed on Charan Das Mahant for objectionable remarks on PM
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు, ఆ రాష్ట్ర
శాసనసభలో ప్రతిపక్ష నేత చరణ్ దాస్ మహంత్‌పై కేసు నమోదయింది. ఒక బహిరంగ సభలో
మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు
నమోదయింది. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాజ్‌నంద్‌గావ్ నగరంలోని కొత్వాలీ
పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ స్టార్
క్యాంపెయినర్ అయిన చరణ్‌దాస్ మహంత్ ఏప్రిల్ 2న రాజ్‌నంద్‌గావ్‌లో ఒక బహిరంగసభలో
చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. ఒక బెత్తం చేత పట్టుకుని ప్రధాని మోదీకి
ఎదురు నిలిచి గొడవ పడగలవారు కావాలని ఆయన అన్నారు.
తమ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కోసం
నిర్వహించిన ప్రచారసభలో చరణ్‌దాస్ మహంత్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఛత్తీస్‌గఢ్
స్థానిక యాసలో మాట్లాడుతూ మహిళలు, రైతుల సంక్షేమం కోసం బఘేల్ ఎంతో
శ్రమించారన్నారు. ‘‘నరేంద్రమోదీకి ఎదురుగా నిలిచి పోరాడే రక్షకుడు మనకు కావాలి. ఒక
బెత్తం చేతిలో పుచ్చుకుని మోదీతో గొడవపడే వ్యక్తి కావాలి. మీ ఎంపీ భూపేష్ బఘేల్ ఆ
వ్యక్తి’’ అని చరణ్‌దాస్ అన్నారు. ఆ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి.
ఛత్తీస్‌గఢ్‌లో 11 ఎంపీ
స్థానాలున్నాయి. వాటికి మూడు దఫాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్
26, మే 7న పోలింగ్ జరగనుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో 9
ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 2 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది.
2014లో బీజేపీ 10 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి.