CPM manifesto calls for removal of military bases, nuclear disarmment, repeal CAA, retrieve Article 370
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిపిఐ(ఎం) విడుదల చేసిన
మ్యానిఫెస్టోను పరిశీలిస్తే ఎంతటివారికైనా కళ్ళు చెదిరిపోక మానవు. భారతదేశపు సైనిక
బలగాల అభివృద్ధిని తిరోగమనం బాట పట్టిస్తామని కమ్యూనిస్టులు బహిరంగంగానే ప్రకటించారు.
సీపీఎం మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలను గమనిస్తే…
పౌరసత్వ సవరణ చట్టాన్ని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టాన్ని, మనీలాండరింగ్
నివారణ చట్టాన్నీ (సిఎఎ, ఉపా, పిఎంఎల్ఎ) తొలగిస్తామని సిపిఎం ప్రకటించింది. ఇంకా,
అణ్వస్త్ర సామర్థ్యాన్ని పూర్తిగా ఉపసంహరిస్తామని, సైనిక స్థావరాలను తొలగిస్తామనీ
స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్‌కు మళ్ళీ స్వయంప్రతిపత్తి ఇస్తామని,
ఆర్టికల్ 370ని మళ్ళీ ప్రవేశపెడతామనీ సిపిఎం తమ మ్యానిఫెస్టోలో వెల్లడించింది. ఇంక
దేశవ్యాప్తంగా ఎన్నికలు రాజ్యవ్యవస్థే నిర్వహించేలా చేస్తామని, రాజకీయ పార్టీలకు
కార్పొరేట్ సంస్థలు నిధులు సమకూర్చడాన్ని నిషేధిస్తామనీ ప్రకటించింది.
అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేట్ చేసిన
ముగ్గురు వ్యక్తులలో నుంచి ఒక వ్యక్తిని గవర్నర్‌గా ఎంచుకొనేలా వ్యవస్థలో మార్పులు
తీసుకొస్తామని సిపిఎం మ్యానిఫెస్టో చెబుతోంది.
మోదీ నేతృత్వంలో దేశంలో లౌకికవాదం ప్రమాదంలో
పడిందని ఆగ్రహించిన సీపీఎం, వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న మతమార్పిడి నిరోధక
చట్టాలను తీసివేస్తామని ప్రకటించింది. అలాగే, బీజేపీ ప్రభుత్వాలు వివిధ ఉన్నత
పదవుల్లో నియమించిన ఆర్ఎస్ఎస్ వ్యక్తులను తొలగించివేస్తామని వెల్లడించింది.
మైనారిటీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామనీ, ఆ మేరకు విద్యావ్యవస్థలోనూ
మార్పులు చేస్తామనీ ప్రకటించింది.
విదేశీ వ్యవహారాల విషయంలో… అమెరికాతో
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటామని సిపిఎం మ్యానిఫెస్టో
పేర్కొంది. అలాగే ఇజ్రాయెల్‌తో అన్నిరకాల భద్రతా, సైనిక సంబంధాలను తెగతెంపులు
చేసుకుంటామని వెల్లడించింది. పాలస్తీనాకు ఏకపక్షంగా మద్దతు ప్రకటించింది.
పాకిస్తాన్‌తో చర్చలు మళ్ళీ మొదలుపెడతామంది. చైనాతో సరిహద్దు సమస్యలు
పరిష్కరించుకోడానికి చర్చలద్వారా ప్రయత్నిస్తామని చెప్పింది. క్వాడ్, ఐ2యు2 వంటి
అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగుతామని వెల్లడించింది. ఇంక అణ్వాయుధాలను, ఇతర
సామూహిక జనహనన ఆయుధాలనూ పూర్తిగా తీసివేస్తామని సిపిఎం ప్రకటించింది.