Committed to neighbourhood first, India responds to Maldives Minister thanks
2024-25 ఆర్థిక సంవత్సరానికి మాల్దీవులకు
నిత్యావసర వస్తువులను సరఫరా చేయడానికి అనుకూలంగా భారత్ తీసుకున్న నిర్ణయానికి ఆ
దేశ మంత్రి మూసా జమీర్ కృతజ్ఞతలు తెలియజేసారు. దానికి స్పందిస్తూ, భారతదేశం తన
పొరుగు దేశాల అభివృద్ధికి కట్టుబడి ఉండడాన్ని విధానంగా పెట్టుకుందని చెప్పారు.
మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి మూసా జమీర్
భారత్ సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. ‘రెండు దేశాల మధ్యా దీర్ఘకాలికంగా ఉన్న
స్నేహానికీ, ద్వైపాక్షిక వాణిజ్య బంధాలను విస్తరించే లక్ష్యానికి భారత్ కట్టుబడి
ఉండడానికీ భారత్ తాజా నిర్ణయమే నిదర్శనం’ అని ఎక్స్ సామాజిక మాధ్యమంలో ట్వీట్
చేసారు.
దానికి భారత విదేశాంగ మంత్రి కూడా ‘ఎక్స్’
మాధ్యమం ద్వారా స్పందించారు. ‘‘భారత్ తన పొరుగు దేశాలకు సాయపడడానికి ఎల్లప్పుడూ నిబద్ధురాలై
ఉంటుంది. అలాగే సాగర్ పాలసీ విధానంలోనూ పొరుగుదేశాలే ప్రధానంగా వ్యవహరిస్తూంటుంది.
‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’ పద్ధతిలో భారత్
తన పక్కనే ఉన్న అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, నేపాల్,
పాకిస్తాన్, శ్రీలంక దేశాలతో సత్సంబంధాలు నెరపుతోంది. ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలే
కాకుండా డిజిటల్ కనెక్టివిటీ, ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంచుకోడానికి ప్రయత్నిస్తోంది.
ఏప్రిల్ 4న చేసిన ట్వీట్లో భారత్ నుంచి మాల్దీవులకు కనెక్టివిటీ కోటాలు పెరిగాయని
ఆ దేశంలోని భారత హైకమిషన్ వెల్లడించింది.
‘‘మాల్దీవుల ప్రభుత్వం అభ్యర్ధన మేరకు భారత
ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి నిత్యావసర వస్తువులను ఎగుమతి చేయడానికి
అనుమతించింది. వాటి కోటా కూడా పెంచింది’’ అని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.
మాల్దీవులలో నిర్మాణ రంగానికి కావలసిన పదార్ధాలను
ఎగుమతి చేసే పరిమాణాన్ని 25శాతానికి పెంచారు. అలాగే ఆహార పదార్ధాల ఎగుమతుల కోటానూ
పెంచారు. గుడ్లు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, చక్కెర, బియ్యం, గోధుమపిండి,
పప్పుధాన్యాల ఎగుమతులను 5శాతం పెంచారు. నిజానికి గతేడాది భారత్ విదేశాలకు బియ్యం,
చక్కెర, ఉల్లిపాయలు ఎగుమతి చేయరాదని నిర్ణయించుకుంది. కానీ మాల్దీవులకు మాత్రం
ఎగుమతులు నిలిపివేయలేదు.
ఇటీవల మాల్దీవులలో
ఎన్నికలు జరిగి, చైనా అనుకూల వైఖరి కలిగిన మొహమ్మద్ మొయిజ్జు ఆ దేశ అధ్యక్షుడిగా
ఎన్నికయ్యారు. ఆ వెంటనే భారత వ్యతిరేక వ్యాఖ్యలు చాలా చేసారు. మాలేలో ఉన్న భారత
సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. అయితే, గతనెల ఆయన స్వరంలో మార్పు
వచ్చింది. తమ దేశానికి రుణ ఉపశమనం కలిగించాలని కోరారు. ఇరుదేశాల సంబంధాలనూ నొప్పించేలా
ఎలాంటి ప్రకటనలూ తాను చేయలేదంటూ వెనుకడుగు
వేసారు.