త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరకొరియా గ్రూపుల సహకారంతో చైనా విఘాతం కలిగించే ప్రమాదముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మైక్రోసాఫ్ సంస్థలోని ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఈ విషయాన్ని పసిగట్టిందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి చైనా ఇటీవల జరిగిన తైవాన్ ఎన్నికల్లోనూ కుట్ర చేసినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తుచేసింది.
రాబోయే కొద్ది రోజుల్లో అమెరికా, భారత్ ఎన్నికల్లోనూ ఏఐ ఉపయోగించి తప్పుడు సమాచారం ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా ప్రజలు ఓటు వేసేప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమవుతారని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఏఐ ద్వారా చైనా వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తోన్న దేశాలు, శత్రుదేశాల్లో విష ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రమాద ముందని ఇటీవల ప్రధాని మోదీని కలసిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ హెచ్చరించారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పినట్లుగా ఒక వాయిస్ సృష్టించి, అక్కడ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తుచేసింది. ఓటింగ్ చేసే ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంలో విఫలమయ్యేలా, తద్వారా ప్రయోజనం పొందాలని చైనా భావిస్తున్నట్లు మైక్రోసాప్ట్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.