బంగారం ధర పరుగులు పెడుతోంది. గడచిన పది రోజుల్లోనే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.5వేలకుపైగా పెరిగింది. తాజాగా ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. పసిడి ధర శనివారం ఒక్క రోజే 10 గ్రాములకు 1300లు పైగా పెరిగి రూ.73010 దాటిపోయింది. జీవనకాల గరిష్ఠాలను తాకింది. దేశీయ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లోనూ పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ధరలు దూసుకెళుతున్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వెండి ధర కూడా కిలో 82 వేలు దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో 31 గ్రాముల ఔన్సు గోల్డ్ 2345 డాలర్ల రికార్డును అధిగమించింది.
బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలతో బంగారం కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారికి 13 శాతంపైగా లాభాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా 15 శాతం రిటర్న్స్ వస్తాయనే అంచనాలు ఉండటంతో బులియన్ మార్కెట్లో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఇటీవల అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు కూడా స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో ఇక బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.