ఓ
కేసు విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ వెళ్ళిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు
అధికారులు గాయపడగా, ఓ వాహనం ధ్వంసమైంది. ఎన్ఐఏ అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టారు.
మేదినీపూర్
జిల్లాలోని భూపతినగర్ లో 2022లో
జరిగిన పేలుడు ఘటన కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా
భూపతినగర్ వెళ్ళిన ఎన్ఐఏ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం వాహనాలపై
రాళ్లు రువ్వారు.
భూపతినగర్
పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్యబిలా గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంటి
వద్ద డిసెంబర్ 2022లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో
ముగ్గురు చనిపోయారు. ఈ కేసు విచారణను 2023 జూన్ లో ఎన్ఐఏ చేపట్టింది.
రేషన్ కుంభకోణం విచారణ కోసం
పశ్చిమబెంగాల్ లోని సందేశ్ ఖాలీ వెళ్ళిన ఈడీ అధికారులపై కూడా గతంలో ఇదే తరహా దాడి
జరిగింది.