గత పదేళ్ల ఎన్డీయే పాలనలో జరిగిన అభివృద్ధి ఒక ప్రారంభం మాత్రమేనని, అసలైన అభివృద్ధి ఎన్నికల తరవాత చూపిస్తామంటూ ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని చురులో జరిగిన భారీ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు సైన్యాన్ని కూడా విమర్శిస్తున్నారని, వారి అసలైన మనస్థత్వం బయటపడిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటి దాకా దేశంలో జరిగిన అభివృద్ధి ఆకలి పుట్టించేది మాత్రమేనని, అసలైనది ఎన్నికల తరవాత ఉంటుందన్నారు.
పదేళ్ల కిందట భారత్ అంటే ప్రపంచ దేశాలకు చిన్నచూపు ఉండేదని, ఇప్పుడు మనవైపు చూడాలంటేనే శత్రువుకు భయమేస్తోందన్నారు. శత్రువుల గడ్డపైన దాడిచేసే సత్తా భారత్‌కు ఉందన్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ఎన్నికల తరవాత ఉంటుందని చెప్పారు. చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది.