ముఖ్యమంత్రిగా
వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుతాలు చేస్తే సీఎం జగన్ మాత్రం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.
ఎన్నికల
ప్రచారంలో భాగంగా బద్వేల్ నియోజక వర్గం అమగంపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన
షర్మిల, జగన్ పాలనలో విభజన హామీ ఒక్కటీ
అమలు కాలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి వైసీపీ ఆలోచించడం లేదన్నారు.
వైఎస్
వివేకానందరెడ్డిని చంపిన వ్యక్తికే సీఎం జగన్, కడప ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించిన
షర్మిల, బాబాయిని చంపిన హంతకులను కాపాడటం దుర్మార్గం అన్నారు. హంతకులు మళ్ళీ చట్టసభలోకి
వెళ్ళకూడదన్నారు. న్యాయం ఓ వైపు ఉంటే అధికారం మరో వైపు ఉందన్నారు. అధర్మం వైపు
నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా…? న్యాయం
వైపు ఉన్న షర్మిల కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని ఓడించాలని
కోరారు.
రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే హత్యా
రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం
అభివృద్ధి చెందుతుందన్నారు. బద్వేల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ
చేస్తున్న విజయజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
షర్మిల
బస్సు యాత్రలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి పాల్గొని మద్దతు
తెలిపారు. వివేకాను చంపిన వాళ్ళకు షర్మిలకు మధ్య పోటీ జరుగుతుందని సునీతారెడ్డి
అన్నారు. తన తండ్రి చివరి కోరిక షర్మిలను
కడప ఎంపీ చేయడమే అన్నారు. వివేకా చివరి కోరికను నెరవేర్చాలన్నారు. వైఎస్సార్ పోలికలు షర్మిలలో ఉన్నాయన్నారు.
షర్మిల
బస్సు యాత్రలో పాల్గొన్న కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ
కోసం ఎంతో శ్రమించిన తనను జగన్ పక్కన పెట్టారని ఆవేదన చెందారు. తనకు వైఎస్సార్
దేవుడితో సమానమన్న కృపారాణి, జగన్ ఓ నియంత అన్నారు.