Arunachal Pradesh to face Lok Sabha and Assembly elections in First Phase
అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రం.
మన దేశంలోని అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు భూటాన్, మయన్మార్, చైనా దేశాలతోనూ
సరిహద్దులు కలిగి ఉన్న రాష్ట్రం. అందుకే చైనా అరుణాచల్ ప్రదేశ్‌పై కన్ను వేసింది.
అక్కడ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
అది కూడా, మొదటి దశలోనే, అంటే ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్‌లో పోలింగ్
పూర్తయిపోతుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు,
60 శాసనసభ నియోజకవర్గాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రాష్ట్రం నుంచి లోక్‌సభలో రెండు స్థానాలు
ఉండగా ఆ రెండుచోట్లా బీజేపీ ఎంపీలే ఉన్నారు.
2019 ఏప్రిల్ 11న జరిగిన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ
ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 60 నియోజకవర్గాలలో 41
స్థానాల్లో గెలిచి మూడింట రెండువంతుల మెజారిటీ సాధించింది.
జనతాదళ్ యునైటెడ్ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ 5, ఇండియన్
నేషనల్ కాంగ్రెస్ 4, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 1, తృణమూల్ కాంగ్రెస్ 1,
స్వతంత్రులు 1 స్థానాలూ సంపాదించుకున్నారు.
మూడింట రెండువంతుల మెజారిటీ సాధించిన బీజేపీలో
ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు అందరూ చేరిపోయారు. ఇద్దరు సభ్యుల ఎన్పీపీ, ఎన్డీయే
కూటమిలో చేరింది. ఫలితంగా బీజేపీ బలం 55కు, ఎన్డీయే బలం 57కు పెరిగింది.
మిగతా మూడు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్ధులే
గెలిచారు. కానీ వారిలో ఒకరు 2024 మార్చి 9న చనిపోయారు. మిగతా రెండు స్థానాల్లోనూ
ఎన్నికను హైకోర్టు చెల్లవని ప్రకటించడం వల్ల ఆ స్థానాలు ఖాళీగా మిగిలిపోయాయి. అవి
తప్పిస్తే, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ప్రతిపక్షం లేని రాష్ట్రంగా ఎన్నికలను
ఎదుర్కొనబోతోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి.
అరుణాచల్ వెస్ట్ స్థానంలో 2004, 2014, 2019 ఎన్నికల్లో కిరెన్ రిజిజు విజయం సాధించారు.
2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి తకమ్ సంజయ్ గెలవగలిగారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో
బీజేపీ తరఫున కిరెన్ రిజిజు, కాంగ్రెస్ నుంచి నబమ్ తూకీ పోటీ పడుతున్నారు.
అరుణాచల్ ఈస్ట్ నియోజకవర్గంలో 2004లో బీజేపీ
తరఫున తపిర్ గావ్ గెలిచారు. 2009, 2014ల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నినాంగ్ ఎరింగ్
విజయం సాధించారు. 2019లో మళ్ళీ బీజేపీ అభ్యర్ధి తపిర్ గావ్ పైచేయి సాధించారు. ఇప్పుడు
2024 ఎన్నికల్లో బీజేపీ తరఫున తపిర్ గావ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా
బొసిరం సిరం రంగంలో ఉన్నారు.
2024 ఏప్రిల్ 19న, అంటే
మొదటి దశలో జరిగే ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు, అక్కడి రెండు
లోక్‌సభా స్థానాలకూ ఎన్నికలు పూర్తయిపోతాయి. ఫలితాల కోసం మాత్రం జూన్ 1 వరకూ
ఆగవలసి ఉంటుంది.