సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో-2024 విడుదల చేసింది. పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారంటీస్
పేరుతో తన 48 పేజీల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది.
హిస్సేదారి న్యాయ్ లో భాగంగా సామాజిక, ఆర్థిక,
కుల గణన చేపడతామన్న కాంగ్రెస్ , ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ
రిజర్వేషన్ల పై 50 శాతం సీలింగ్ తొలగిస్తామని హామీ ఇచ్చింది.
అధికారమిస్తే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ ప్రవేశపెడతామన్న కాంగ్రెస్, జల్
జంగల్ జమీన్ పై చట్టబద్ధహక్కులు
కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్
ఏరియాలుగా గుర్తిస్తామని వాగ్దానం చేసింది.
కిసాన్ న్యాయ్ లో భాగంగా స్వామినాథన్
ఫార్ములా ప్రకారం పంటల గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ
వెల్లడించింది. రుణమాఫీ కమిషన్ ఏర్పాటుతో పాటు పంట
నష్టపోయిన 30
రోజుల్లో బీమా పరిహారం చెల్లింపునకు గ్యారెంటీ ప్రకటించింది.
రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి
విధానం తీసుకురావడంతో పాటు వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తామని హస్తం పార్టీ పేర్కొంది.
శ్రామిక్
న్యాయ్ లో భాగంగా రైట్
టు హెల్త్ చట్టం
అమలు చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల
కనీస వేతనం రోజుకు 400 రూపాయలకు
పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం
అమలు చేయడంతో పాటు అసంఘటిత రంగ
కార్మికులకు జీవిత బీమా, యాక్సిడెంట్ బీమా సౌకర్యం
కల్పిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల చేస్తామని కాంగ్రెస్
పార్టీ వెల్లడించింది.
యువ
న్యాయ్ లో భాగంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యువతకు
ఏడాది అప్రెంటిస్ట్ షిప్ తో పాటు నెలకు రూ.8500 సాయం. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం
తీసుకొస్తామని పేర్కొంది. గిగ్
వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు చేపడతామని మేనిఫెస్టో లో పేర్కొంది. యువతకు
ప్రొత్సాహం కల్పించేందుకు గాను స్టార్టప్
కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయిస్తామంది.
నారీ
న్యాయ్‌లో భాగంగా ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం
అందజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ
వాగ్దానం చేసింది.
ఎన్డీయే
ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ ను రద్దు చేయడంతో పాటు జమ్ము-కశ్మీర్ కు రాష్ట్ర హోదా
కల్పిస్తామని కాంగ్రెస్ తన విజన్ డాక్యూమెంట్ లో ప్రకటించింది. మార్చి 15 నాటి
వరకు ఉన్న విద్యా రుణాలు రద్దు చేస్తామంది. మైనారిటీలకు వస్త్రధారణ, ఆహారం, భాష,
పర్సనల్ లాను ఎంచుకునే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ తెలిపింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున
ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, ఇతర కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోను
విడుదల చేశారు.