పగటిపూట
గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నానా అవస్థలు
పడుతున్నారు. సాధారణం కంటే
రెండు నుంచి నాలుగు డిగ్రీల అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు వడగాడ్పులు
తోడుకావడంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రకు భారత వాతావరణ సంస్థ, ‘ఎల్లో అలర్ట్’
జారీ చేసింది.
ఉత్తరాంధ్రలో
33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగత్రలు నమోదు అవుతుండగా, రాయలసీమ, దక్షిణకోస్తాంధ్రలో
41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. దీంతో ఉదయం 11
గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు సరైన రక్షణ చర్యలు లేకుండా బయటకు వెళ్ళవద్దని వాతావరణ
శాఖ హెచ్చరించింది.
రాత్రి సమయాల్లో
కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డు అవుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా సగటున 25 నుంచి 27 డిగ్రీలు ఉష్ణోగత్ర నమోదు అయింది.
రాయలసీమ
పరిధిలోని నంద్యాల జిల్లాలో అత్యధికంగా గురువారం నాడు 44 డిగ్రీల సెల్సీయస్
ఉష్ణోగ్రత రికార్డు అయింది.
ఉదయం
8.30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల మధ్య నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1
డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రకటించింది.
వైఎస్సార్
కడప జిల్లా చిన్న చెప్పల్లిలో 43.6
డిగ్రీలు, కర్నూలు జిల్లా లడ్డగిరిలో 43.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దారిమడుగులో
43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రాష్ట్రంలోని
21 మండలాల పరిధిలో తీవ్ర వడగాడ్పులు వీస్తుండగా, 97 మండలాల్లో వడగాల్పుల ప్రభావం
ఉంది. రేపు(శనివారం)కూడా ఈ రోజు తరహా వాతావరణమే ఉండనుంది.
ప్రజలు
వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల
సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.