అమేథీ అంటేనే కాంగ్రెస్ పార్టీకి, ఇందిరాగాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉండేది. ఇక్కడ నుంచి రాజీవ్, సంజయ్, సోనియా, రాహుల్ గాంధీలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.గాంధీల కుటుంబానికి అమేథీ ఐదు దశాబ్దాలపాటు కంచుకోటగా నిలిచింది.2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ కోటకు బీటలు వారాయి. అక్కడ రాహుల్‌గాంధీపై బీజేపీ నేత స్మృతి ఇరానీ గెలిచారు. ఇక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకోవడంతో, అమేథీలో ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇటీవల మీడియాకు రాబర్ట్ వాద్రా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను అమేథీ ప్రజలు అక్కడి నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించారు. దీంతో అమేథీ బరిలో రాబర్ట్ వాద్రా దిగడం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.
అనూహ్యంగా యూపీ కాంగ్రెస్ ఈ వార్తలను ఖండించింది. అమేథీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాబర్ట్ వాద్రా పేరులేదని ప్రకటించింది. ఇవాళ ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ పెద్దల సమావేశంలో విషయం తేలనుంది. ఇక గతంలో సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీలో ఆమె తనయ ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.