పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. చంబా పట్టణంలో భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. చంబాకు నూరు కిలోమీటర్ల దూరంలోని మనాలిలో కూడా భూమి కంపించింది. వరుస ప్రకంపనలు రావడంతో జనం పరుగులు తీశారు.
చంబా కేంద్రంగా గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. భూమి లోపల 10 కి.మీ లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.ఈ నెల 1వ తేదీ చమోలి, లాహుల్, స్పితిలో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిమాలయాల ప్రాంతం భూకంపాల జోన్లో ఉండటంతో అక్కడ తరచూ భూ ప్రకంపనలు వస్తూనే ఉంటాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.